Pawan Kalyan : అమిత్ షా అదే అడిగితే.. దానికి షరతు ఇదేనట
ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పెద్దలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు
ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పెద్దలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. తెలంగాణాలో పొత్తు అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే ప్రత్యేక విమానంలో పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తో కలసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఆ తర్వాత నడ్డాతో కూడా ఆయన సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా అమిత్ షాతో తెలంగాణ ఎన్నికల్లో పొత్తు అంశంపై చర్చిస్తారని తెలిసింది.
తెలంగాణలో పోటీ చేయకుండా...
అయితే తెలంగాణలో ఈసారి పోటీ చేయకుండా తమకు మద్దతివ్వాలని కేంద్రం పెద్దలు కోరతారా? అందుకు పవన్ నుంచి ఏ రకమైన సమాధానం వస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో జనసేన, టీడీపీతో కలసి వస్తామంటే తెలంగాణలో పోటీ నుంచి పక్కకు తప్పుకునేందుకు జనసేనాని సిద్ధపడతారని అంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకుండా తమకు మద్దతివ్వాలనే బీజేపీ అగ్రనాయకులు పవన్ కల్యాణ్ ను కోరే అవకాశాలున్నాయని తెలిసింది. తెలంగాణ బీజేపీ పై ఎన్నికల సందర్భంగా ఏపీ ముద్ర పడకుండా ఉండేందుకే ఈ రకమైన సాయాన్ని వారు పవన్ ను కోరనున్నట్లు సమాచారం.
తెలంగాణ ముఖ్యం కాదు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలంగాణ ముఖ్యం కాదు. ఆయన తెలంగాణలో పెద్దగా దృష్టి పెట్టిందీ లేదు. తిరిగిందీ లేదు. ఇక్కడ పోటీ చేసినా, చేయకపోయినా ఆయనకు పోయేదేమీ లేదు. వచ్చేది అంతకన్నా లేదు. లేని చోట తపన పడే కన్నా, ఉందనుకున్న చోట జాగ్రత్త పడటం మంచిది కదా? ఇప్పుడు పవన్ కూ అదే అవసరం. బీజేపీ నేతల అవసరం పవన్ కు కలసిసొచ్చినట్లుంది. అందుకే పిలుపొచ్చింది. తెలంగాణలో పోటీ చేయకుండా ఉంటాం కానీ, ఏపీలో మాత్రం తమ కూటమితో పొత్తు పెట్టుకోవాలని అమిత్ షా ను కోరనున్నారని చెబుతున్నారు. జగన్ ను ఓడించడమే ధ్యేయంగా ఉన్న పవన్ కల్యాణ్ పవర్ అస్త్రను ఉపయోగిస్తారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఏపీ రాజకీయాలపై...
అమిత్ షాతో మాట్లాడే సమయంలో ఎక్కువ సేపు ఏపీ రాజకీయాలపైనే పవన్ మాట్లాడే అవకాశముందని కూడా తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబును జైలులో ఉంచడంతో పాటు ప్రతిపక్షాలపై జగన్ ప్రభుత్వం వేధింపులకు గురిచేయడం, అక్రమ కేసులు పెట్టి వేధించడంపై కూడా హోంమంత్రితో చర్చించనున్నారని తెలిసింది. అందుకే పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా త్యాగం చేసి, ఏపీలో మాత్రం పొత్తు కుదుర్చుకునే వస్తారన్న అభిప్రాయం జనసేన నేతల్లోనూ ఎక్కువగా ఉంది. మరి అమిత్ షా పవన్ ప్రతిపాదనకు ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. పవన్ టూర్ మాత్రం తెలంగాణ కన్నా ఏపీ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నది మాత్రం వాస్తవం.