Jogaiah : ఎవరిని షేక్ చేయడానికి బాబాయ్.. పవన్ నా? చంద్రబాబునా?

సీనియర్ నేత హరిరామ జోగయ్య రాసిన లేఖ పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఇబ్బంది పెడుతుంది

Update: 2024-02-16 06:13 GMT

ఏదైనా ఒకరికి మంచి చేయాలని ఉద్దేశ్యం వేరు. ప్రచారం కోరుకోవం మరొక తీరు. ప్రస్తుతం సీనియర్ నేత హరిరామ జోగయ్య తీరును చూస్తుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సహకరిస్తున్నారా? లేక ఫిట్టింగ్ పెడుతున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చేగొండి హరిరామ జోగయ్య సీనియర్ నేత. ఆయనకు ఏపీ రాజకీయాల్లో అపార అనుభవం ఉంది. అయితే నేరుగా అభ్యర్థులను, సీట్లను ఎంపిక చేస్తూ పవన్ కల్యాణ్ కు తలనొప్పిగా మారిపోయారు. ఆయన చేయాల్సిన పని సలహాలివ్వడం వరకే. అంతే తప్ప పలానా సీటులో పలానా వారు పోటీ చేయాలంటూ ఏకంగా ఒక లిస్ట్ విడుదల చేయడం అంటే జనసేనానిని ఇరకాటంలో పడేయటేమనన్నది జనసేన నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.

నిజంగా ప్రేమ ఉంటే...
నిజంగా హరిరామ జోగయ్యకు జనసేన మీద ప్రేమ ఉండి ఉంటే...? పవన్ కల్యాణ్‌‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే... లేదా.. ఆయన పార్టీని అధికారంలోకి తేవాలనుకున్నప్పుడు ఇది సరైన విధానం కాదన్నది కాపు నేతల నుంచి వినిపిస్తున్న మాట. తాను చెప్పదలచుకున్నది ఏదైనా ఉంటే నేరుగా పవన్ కల్యాణ్ కు ఆయన చెప్పవచ్చు. అది ఆయనకు సాధ్యమవుతుంది. అంతే తప్ప బహిరంగ లేఖలను విడుదల చేసి పవన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడమేనని అంటున్నారు. ఒకవేళ హరిరామ జోగయ్య చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీట్లు ఇవ్వకపోయినా... ఆయన సూచించిన స్థానాలు కేటాయించకపోయినా కాపు సామాజికవర్గం కొంత ఆలోచనలో పడే ప్రమాదముంది.
నష్టం కాదా?
అదే సమయంలో పవన్ అభిమానులు కూడా టీడీపీకి సహకరించేందుకు ముందుకు రాకపోవచ్చు. జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ కాకపోవచ్చు. ఇన్ని నష్టాలు జరుగుతాయని జోగయ్యకు తెలియంది కాదు.. తాను చంద్రబాబును ఇరకాటంలో పెడుతున్నానని భావించి పెద్దాయన పవన్ ను ఇబ్బంది పెడుతున్నట్లే అనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఖరారయింది. బీజేపీ విష‍యం ఇంకా తేలలేదు. ఆ పార్టీ ఎన్ని సీట్లు, ఏ స్థానాలు అడుగుతుందో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో జోగయ్య లేఖ జనసేననే కాదు టీడీపీని కూడా షేక్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఈ ఫిట్టింగ్‌‌లు ఏంటిరా బాబూ అంటూ రెండు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు.
యాచించే స్థాయి నుంచి...
హరిరామ జోగయ్య ఆరు పార్లమెంటు స్థానాలు, 41 అసెంబ్లీ స్థానాలు తీసుకోవాలంటూ పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. పవన్ కల్యాణ్, నాగబాబులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా ఆయన సూచించారు. కాపు సామాజికవర్గం యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నంలో జనసేనకు ఎక్కువ స్థానాలను కేటాయించాలని కూడా జోగయ్య లేఖలో పేర్కొన్నారు. జోగయ్య ఇంట్లో కూర్చుని జాబితా తయారు చేసి మరీ మార్కెట్ లో వదులుతుంటే బయట తిరిగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాత్రం రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఉంటే గుట్టుగా పవన్ కు సమాచారం అందించాలి కానీ, పవన్ కు నష్టం చేకూర్చేలా ఈ లేఖలేంటని విసుక్కునే వారు కూడా అనేక మంది కాపు సామాజికవర్గంలో ఉన్నారు.


Tags:    

Similar News