Mudragada : కిర్లంపూడిలో గాజు గ్లాసు గలగలలు.. తప్పేంటంటున్న అభిమానులు
ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారని తెలిసింది. ఆయన జనసేనలో చేరే అవకాశాలున్నాయి
ఏ రాజకీయ నేత అయినా ఎన్నాళ్లు వెయిట్ చేస్తారు. ఒకసారి పాలిటిక్స్ ను రుచి చూసిన వారు ఎవరూ దానిని అంత సులువుగా వదిలిపెట్టరు. అందుకు ఎవరూ అతీతులు కాదు. తమతో పాటు తమ వారసులకు కూడా రాజకీయ అవకాశాలను కల్పించేందుకు సమయం కోసం ఎదురు చూస్తుంటారు. అందుకు భేషజాలను కూడా పక్కన పెడతారు. గతంలో తాము తీసుకున్న నిర్ణయాలకు కూడా స్వస్తి చెప్పడానికి వెనకాడరు. సమాజం కాదు.. కులం కాదు.. ప్రతి రాజకీయ నాయకుడికీ ఇంపార్టెంట్ తన సొంత లాభమే. అంటే తాను, తన కుటుంబం రాజకీయాల్లో విరాజిల్లుతుండాలని కోరుకుంటారు. అందులో తప్పులు వెదకటానికి కూడా ఏమీ ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎవరి నిర్ణయం వారిది. ఎవరి ఇష‌్టం వారిది.
రాజకీయ కోణంలోనే...
ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా అదే బాటలో పయనిస్తున్నారు. పెద్దాయన పద్మనాభం పై విమర్శలు చేయడం కూడా సరికాదు. ఎందుకంటే ఆయన దాదాపు 2009 నుంచి ఆయన రాజకీయంగా ఖాళీగానే ఉన్నారు. 2014లో కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి తెలుగుదేశం పార్టీతోనూ, ఆ పార్టీ అధినేతతోనూ ఏర్పడిన గ్యాప్ ను మనం వ్యక్తిగతంగా చూడాల్సిన పనిలేదు. కేవలం సామాజిక, రాజకీయం కోణంలోనే చూడాలి. తన మీద కేసులు పెట్టారని ముద్రగడ శాశ్వతంగా ఆ పార్టీకి దూరం అయితే జరిగే నష్టం తనకే కదా? అందుకే ఆయన బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లుంది.
టీడీపీలో చేరకపోయినా...
అయితే నేరుగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ఆయన ఇష్టపడకపోయినా ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న జనసేనతో జత కట్టాలనుకుంటున్నారు. జనసేనలో చేరితే ప్రస్తుతం ఉన్న ఊపులో తాను ఖచ్చితంగా చట్ట సభల్లో అడుగు పెడతానని ఆయన నమ్మకం కావచ్చు. అంతేకాదు.. జనసేన అయితే తనతో పాటు తన కుమారుడికి కూడా సీటు సులువుగా తెచ్చుకోవచ్చు. అందుకే ఆయన జనసేన ఆప్షన్ ఎంచుకున్నారు. ఇటు సామాజికవర్గం పరంగా మాత్రమే కాకుండా గోదావరి జిల్లాలో ప్రభావం చూపనున్న పార్టీలో చేరి తన వారసుడిని కూడా అసెంబ్లీకి పంపేందుకు ఆయన సుముఖంగా ఉన్నారు. అందుకోసమే ఆయన జనసేనతో కలసి పనిచేయాలని డిసైడ్ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి.
షరతులు ఏవంటే?
పవన్ కల్యాణ్‌కు కూడా ముద్రగడ లాంటి కాపు పెద్దల ఆశీస్సులు అవసరం. అందుకే ఆయనను సాదరంగా ఆహ్వానించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తొలుత వైసీపీలోకి వెళదామనుకున్నా అక్కడ తాను ఆశించిన స్థాయిలో ఆఫర్ దొరకడం లేదు. అందుకే పవన్ కల్యాణ‌్ తో ముద్రగడ భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే తాను జనసేనలో చేరితే తూర్పు గోదావరి జిల్లాలో రెండు, నెల్లూరులో మరో స్థానం ఆయన ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేనలో అది సాధ్యం అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. పవన్ కల్యాణ‌్ స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడ పద్మనాభంతో భేటీ అయిన తర్వాత దీనిపై స్పష్టత రానుంది. ముద్రగడ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే ఆయన పోరాటం చేసి అలసి పోయి ఉన్నారు. అందుకే ఆయనకు కొంత రిలీఫ్ అవసరమని ఆయన అనుచరులు సయితం భావిస్తున్నారు.