Nature’s 10 లిస్టులో కల్పన కాళహస్తి
అద్భుతమైన ఆవిష్కరణలు, సమస్యలపై పోరాడిన మహిళల లిస్టును
2023 సంవత్సరంలో సైన్స్‌లో కీలక పరిణామాలలో భాగమైన వారిని, అద్భుతమైన ఆవిష్కరణలు, సమస్యలపై పోరాడిన మహిళల లిస్టును నేచర్ సంస్థ విడుదల చేసింది. నేచర్స్ 10లో తెలుగు మహిళ కల్పన కాళహస్తి భాగమయ్యారు. నేచర్స్ 10 సైన్స్ లో భాగంగా ప్రపంచంలో గొప్ప మార్పులు తీసుకుని వచ్చిన 10 మంది ప్రభావవంతమైన వ్యక్తుల గురించి తెలియజేస్తుంది. ఈ ఏడాది భారతదేశం సాధించిన గొప్ప విజయంలో చంద్రయాన్-3 ఒకటి. అందులో భాగమయ్యారు కల్పన కాళహస్తి.
చిత్తూరు జిల్లాకు చెందిన కల్పన కాళహస్తి చెన్నైలో బీటెక్ ఈసీఈ చదివారు. కల్పన చిన్నతనం నుంచే ఇస్రోలో ఉద్యోగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బీటెక్ పూర్తయిన వెంటనే ఇస్రోలో 2000లో శాస్త్రవేత్తగా విధుల్లో చేరారు. మొదట శ్రీహరికోటలో ఐదేళ్లపాటు విధులు నిర్వహించారు. 2005లో బదిలీపై బెంగళూరులోని ఉపగ్రహ కేంద్రానికెళ్లి అక్కడ విధులు నిర్వహించారు. ఐదు ఉపగ్రహాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 2018లో పంపిన చంద్రయాన్-2 ప్రాజెక్టులో ఈమె భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం చంద్రయాన్-3 ప్రాజెక్టు అసోసియేటెడ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన విజయవంతమైన మిషన్ గా చంద్రయాన్-3 నిలిచాక.. సోవియట్ యూనియన్, అమెరికా, చైనా తర్వాత భారత్ ఈ ఘనత సాధించింది. చంద్రయాన్-3 అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కల్పన కాళహస్తి ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించారు. చంద్రయాన్-2 మిషన్ ఫెయిల్యూర్ తర్వాత చాలా నేర్చుకున్నామని.. ఆ ఫెయిల్యూర్ లో నేర్చుకున్న ఎన్నో విషయాలు చంద్రయాన్-3 విజయవంతం అవ్వడానికి కారణమయ్యాయని ఆమె చెప్పారు.