సిక్సరా? క్లీన్ బౌల్డా?

రాజకీయాలకు వయసుతో సంబంధం లేదు. ఎన్ని పార్టీలు మారామన్నది జనం చూడరు

Update: 2023-09-25 07:59 GMT

రాజకీయాలకు వయసుతో సంబంధం లేదు. ఎన్ని పార్టీలు మారామన్నది జనం చూడరు. ఆ నేత వల్ల ఉపయోగం ఉంటుందా? లేదా? అనేదే చూసి పార్టీలు టిక్కెట్లు కేటాయిస్తాయి. ఆర్థికంగా బలవంతుడయితే చాలు అరవై శాతం ప్లస్ పాయింట్లు పడినట్లే. బలమైన సామాజికవర్గం ఉంటే మరో ఇరవై శాతం పాయింట్లు యాడ్ అవుతాయి. అంతేతప్ప పార్టీల సిద్ధాంతాలు నమ్మి వచ్చి చేరారా? గత హిస్టరీ ఏంటి? అనేది ఏ పార్టీ చూడదు. గెలుస్తారనుకుంటే ఎవరికైనా టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. దాదాపు పదేళ్లు గ్యాప్ తీసుకున్నతర్వాత మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనను ప్రజలు ఆదరిస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే పోటీకి దిగి తానేంటో మరోసారి నిరూపించుకోవడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెడీ అవుతున్నట్లే కనపిస్తుంది.

కొన్నాళ్లు దూరంగా…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విలక్షణమైన నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసి చరిత్రలోకి ఎక్కారు. అలాగే లాస్ట్ బాల్ సిక్సర్ అంటూ ఏపీ ప్రజలకు విభజన జరగదంటూ నమ్మించడంలో కూడా ఈయన పాత్ర మామూలుగా లేదు. చివరి నిమిషం వరకూ ఏపీ ప్రజలను మభ్యపెడుతూనే ఉండి లాస్ట్ మినిట్ లో చేతులెత్తేశారు. బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన నల్లారి ఎవరూ ఊహించని విధంగా వైఎస్ మరణం తర్వాత రోశయ్యను తొలగించి మరీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ప్రత్యేకంగా జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. తన పార్టీ తరుపున అభ్యర్థులను పెట్టినా పీలేరులో మినహా ఎక్కడా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు.
కాంగ్రెస్ నుంచి…
దీంతో ఆయన తన శక్తి ఏంటో తనకు అర్థమవ్వడంతో కొన్నేళ్ల పాటు రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. హైదరాబాద్ కే పరిమితమైన నల్లారి తన పార్టీని మూసేసి తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో ఏమయిందో ఏమో? తెలియదు కానీ అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్ కు ఇక మనుగడ లేదని భావించిన నల్లారి తనకు ఏ గవర్నర్ గిరీ అయినా దక్కకపోతుందా? అన్న కారణంతోనే ఆయన కమలం పార్టీని ఆశ్రయించినట్లు చెబుతారు. అయితే బీజేపీ లో కూడా నెగ్గుకు రావడం అంత సులువు కాదు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత కామ్ గా ఉన్నట్లు కమలం పార్టీలో ఉంటే కుదరదు. ఇక్కడ యాక్టివ్ గా ఉండే నేతలకే ప్రయారిటీ ఉంటుంది. అయినా నల్లారిది గవర్నర్ పదవి చేపట్టే వయసు కాదు. ముఖ్యమంత్రి చేసిన నేత సహజంగా కేంద్రంలో మంత్రిపదవిని ఆశించడం సహజం.
పార్లమెంటుకు పోటీ…
ఇప్పుడు నల్లారి కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు అర్థమవుతుంది. ఆయన వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సిగ్నల్స్ వస్తున్నాయి. ఇటీవల ఆయన అన్నమయ్య జిల్లాలో పర్యటించడమే ఇందుకు నిదర్శనం. రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకే ఆయన పర్యటిస్తూ అక్కడ క్యాడర్ ను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రైల్వే కోడూరు, తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, మదనపల్లె, రాజంపేట, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో తనకు పట్టుందని ఆయన గట్టి నమ్మకం. తన సొంత నియోజకవర్గమైన పీలేరు కూడా ఇదే నియోజకవర్గంలో ఉండటంతో తన గెలుపు పెద్ద కష్టం కాదని కూడా ఆయన విశ్వసించి బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు.
ఒక బాల్ కు..
రాజంపేట లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేయడానికి మరొక కారణం కూడా ఉంది. అక్కడ తనకు బద్ధ శత్రువైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిధున్ రెడ్డి గత రెండు దఫాలుగా ఎంపీగా ఉన్నారు. మరోసారి పోటీకి దిగుతారు. మిధున్ రెడ్డిని ఓడించడమే తన థ్యేయంగా ఆయన రాజంపేటను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటు బీజేపీ నుంచి పోటీ చేస్తే టీడీపీ ఓటు బ్యాంకు కూడా తనకు టర్న్ అయ్యే అవకాశాలున్నాయని నల్లారి లెక్కలు వేసుకుని మరీ దిగుతున్నారు. ఇటు గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవితో పాటు తన శత్రువును రాజకీయంగా గట్టి దెబ్బకొట్టే చక్కటి అవకాశంగా ఆయన భావిస్తున్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బలిజ ఓట్లు కూడా ఎక్కువగా ఉండటం, జనసేన తమ పార్టీతో పొత్తులో ఉండటంతో ఆయన గెలుపుపై మరిన్ని ఆశలు పెట్టుకుని దిగుతున్నారు. ప్రత్యర్థి నో బాల్ వేస్తే సిక్సర్ కొట్టి విక్టరీ సాధించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. మరి ఆయన సిక్సర్ కొడతారా లేక క్లీన్ బౌల్డ్ అవుతారా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News