క్రెడిట్ కార్డులు.. మనల్ని ఇంకా పేదవాళ్లను చేస్తున్నాయా

క్రెడిట్ కార్డ్ బకాయిలు 2 లక్షల కోట్లను అధిగమించాయి. ప్రస్తుతం భారతదేశంలో 8.6 కోట్ల కార్డ్‌లకు

Update: 2024-02-12 11:21 GMT

క్రెడిట్ కార్డు.. మనకు ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఉన్నా.. లేకున్నా.. కూడా వాటిని మన చేతుల్లో పెట్టేయడానికి వస్తూ ఉంటారు. ఇలా ఎంతో మందికి క్రెడిట్ కార్డులతో అవసరం లేకపోయినా అంటగడుతూ ఉన్నారు. అలాగే మనం కూడా క్రెడిట్ కార్డుల అవసరం లేకున్నా కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇక క్రెడిట్ కార్డులను తీసుకున్నాక.. ఏదో ఒకటి అవసరం ఉన్నా లేకున్నా కూడా కొనేసుకుని పెట్టేసుకుంటూ ఉంటాం. అవసరానికి డబ్బులు కావాలన్నా కూడా క్రెడిట్ కార్డులను స్వైప్ చేసేస్తూ ఉండడం మనకు కూడా అలవాటే!! ఇవన్నీ చూస్తుంటే మనం క్రెడిట్ కార్డులను విపరీతంగా వాడేసి మనం ఆర్థికంగా దిగజారిపోతూ ఉన్నామా? మరింత పేదరికం లోకి వెళ్ళిపోతూ ఉన్నామా?

క్రెడిట్ కార్డును ఈ నెల ఫుల్ గా వాడేసి ఉంటాం.. అయితే ఆ బిల్లును పూర్తిగా పే చేయలేకపోతూ ఉంటాం. క్రెడిట్ కార్డు బిల్లును మొత్తం ఒకేసారి చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ మినిమమ్ అమౌంట్ ఆప్షన్ ఎంచుకుంటుంటారు. ఈ పేమెంట్ ఆప్షన్ అనేది ఆ సమయంలో ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుందేమో కానీ.. ఆర్థిక భారానికి దారి తీస్తుందనే విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోండి. మినిమమ్ బ్యాలెన్స్ పేమెంట్స్ ద్వారా బాగా నష్టపోతూ ఉన్నాం. క్రెడిట్ కార్డులపై వడ్డీ రహిత పీరియడ్ ఉంటే.. బ్యాంకులు నిర్దేశించిన సమయంలోపు బిల్లులు చెల్లిస్తే ఎలాంటి అదనపు భారం ఉండదు. సమయం దాటితే మాత్రం భారీగా చెల్లించాల్సి వస్తుంది. వడ్డీ రేట్లు భారీగా ఉంటాయి. బ్యాంకులు దీనిని కేవలం వడ్డీగానే చూస్తాయి. అంటే మళ్లీ చెల్లించాల్సిన సమయంలో మీ బిల్లు మొత్తం కట్టాల్సిందే. అత్యవసరం సమయంలో ఒక నెల, రెండు నెలలపాటు సర్దుబాటు కోసం ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. అలాగని కొన్ని సంవత్సరాల పాటూ చెల్లిస్తూ ఉంటే మాత్రం భారీగా డబ్బులు బ్యాంకులకు చెల్లిస్తూ ఉండిపోవాలి. మీకు వచ్చే సంపాదనలో చాలా భాగం క్రెడిట్ కార్డు బిల్లులకే అయిపోయే ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని తెలుసుకోవాలి.
కొన్ని బ్యాంకులు, కార్డు సంస్థలు బాకీ ఉన్న మొత్తంపై 36 శాతం నుంచి 48 శాతం వరకూ వడ్డీని విధిస్తున్నాయి. అలాంటప్పుడు మినిమమ్ అమౌంట్ పేమెంట్ చేస్తూ పోతూ ఉంటే.. వడ్డీలు, ఇతర డబ్బులు ఇలా ఒకటికి మరోకటి జత అవుతుంటాయి. ఈ క్రెడిట్ కార్డు ఒక దీర్ఘకాలిక భారంగా మారుతుంటుంది. బిల్లు చెల్లింపు సకాలంలో పూర్తి కాకపోతే ఆలస్యపు రుసుములు, వడ్డీల భారంతో పాటు క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఎర:

మనం ఆన్ లైన్ షాపింగ్ చేయాలని ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్ సైట్ ఓపెన్ చేసామంటే చాలు.. ఒక కంపెనీకి సంబంధించిన క్రెడిట్ కార్డు మీద మాత్రమే ఆఫర్లు ఉండడం గమనించవచ్చు. ఇక వేరే వెబ్ సైట్ ఓపెన్ చేసినా కూడా అలాంటి ప్రకటనలే మనం చూస్తూ ఉంటాం. ఏదైనా మాల్ కు వెళ్లినా అక్కడి స్టోర్స్ లో ఓ కంపెనీకి చెందిన క్రెడిట్ కార్డు మీద మాత్రమే ఆఫర్ నడుస్తూ ఉండడం మనం గమనించే ఉంటాం. ఇలాంటి ఆఫర్ల కారణంగా అన్ని కంపెనీల క్రెడిట్ కార్డులను మనం మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టుకున్నా.. కొన్ని కొన్ని సార్లు వాటిని వినియోగించలేము మనం. అలా పెట్టుకోవడం వలన ఇయర్లీ ఛార్జీలను పే చేస్తూ మన డబ్బును కోల్పోవాల్సి ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌, ఇతర ఆన్‌లైన్‌ సైట్లు షాపింగ్‌లపై రకరకాల డిస్కౌంట్లు ఇస్తుంటాయి. ఆఫర్లను చూసి క్రెడిట్‌ కార్డులతో షాపింగ్ చేసేస్తుంటారు. క్రెడిట్ కార్డ్ బిల్లు వచ్చిన తర్వాత చెల్లించేటప్పుడు షాక్ అవుతూ ఉంటాం. అయ్యో.. అనవసరంగా కొనేశానే.. అవసరం ఉన్నా లేకున్నా అని అనుకుంటూ ఉంటాం మనం. మీరు ఈ బిల్లుపై సకాలంలో చెల్లింపు చేయకపోతే, మీరు అప్పుల ఊబిలో కూరుకుపోవచ్చు. మీరు మీ క్రెడిట్ కార్డ్ ను పరిమిత పరిధిలోనే ఉపయోగించుకోవాలని చూడండి. మీ కార్డ్ క్రెడిట్ వినియోగ రేటు (CUR)పై కూడా అంచనా ఉండాలి. సీయూఆర్‌ మీరు ఉపయోగించిన క్రెడిట్ పరిమితి శాతాన్ని చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 30% వరకు ఉన్న CURను అనువైనదిగా పరిగణిస్తారు. ఉదాహరణకు మీ కార్డ్‌కు 1,00,000 రూపాయల పరిమితి ఉంటే, మీరు 30,000 రూపాయల వరకు ఖర్చు చేయాలి. దీని కంటే ఎక్కువ ఖర్చు చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌ దెబ్బతినవచ్చు. మీ CUR 30% మించి ఉంటే మీరు మీ కార్డ్ పరిమితిని పెంచుకోవడం మంచిది.
క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు తమ కార్డును ఉపయోగించి క్యాష్ ను విత్ డ్రా చేసుకోవచ్చు. మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏటీఎం నుండి డబ్బును తీసుకున్నప్పుడు, మొదటి రోజు నుండి వడ్డీని వేస్తారు. ఈ వడ్డీ రేటు 2% నుంచి 3% వరకు ఉంటుంది. బ్యాంకులు ఈ సేవకు కొంత రుసుమును కూడా వసూలు చేస్తాయి. అదనంగా మీరు 18% జీఎస్టీ చెల్లించాలి. అందుకే క్రెడిట్ కార్డ్‌ల నుంచి నగదును తీసుకోకుండా ఉండడమే బెటర్.
కరోనా మహమ్మారి కారణంగా క్రెడిట్ కార్డు ఇబ్బందులు:

ఈ నెల జీతం/ డబ్బులు రాగానే.. క్రెడిట్ కార్డు బిల్లు కట్టేద్దామని కొందరు భావిస్తూ ఉంటారు. అలాంటిది ఉన్నట్లుండి వచ్చే నెల నుండి ఉద్యోగాన్ని కోల్పోతే.. ఆదాయం అందకపోతే!! పరిస్థితి ఏమిటి. కరోనా మహమ్మారి సమయంలో అలాంటి ఎన్నో సమస్యలను క్రెడిట్ కార్డు హోల్డర్లు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా తలక్రిందులు అయిపోయాయి. కొందరు ఎక్కడో ఒక చోట నుండి అప్పులు తీసుకుని వచ్చేసి కట్టేయగా.. ఇంకొందరు బిల్లులు కట్టకుండా అలాగే ఉండిపోయారు. దీంతో క్రెడిట్ కార్డు బిల్లులు కొండంత పెరిగిపోయాయి. క్రెడిట్ కార్డులో తీసుకున్నది కొంచెమే అయితే.. కొన్ని నెలల తర్వాత ఆ బిల్లు కట్టాలంటే జనాలకు కన్నీళ్లు వచ్చాయి.
2023లో క్రెడిట్ కార్డ్ వినియోగంలో గణనీయమైన పెరుగుదల చూసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తెలిపింది. రుణం కూడా భారీగా పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. మార్చి 2023 నాటికి, క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్‌లు `4,072 కోట్లకు పెరిగాయి, ఇది మొత్తం క్రెడిట్ కార్డ్ రుణంలో 1.94 శాతం. ఏప్రిల్ 2023లో క్రెడిట్ కార్డ్ బకాయిలు 2 లక్షల కోట్లను అధిగమించాయి. ప్రస్తుతం భారతదేశంలో 8.6 కోట్ల కార్డ్‌లకు పైగా చలామణిలో ఉన్నాయి. భారతీయుల క్రెడిట్ కార్డ్ ఖర్చు కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. భారతీయులలో రుణభారం పెరుగుతూ ఉంది. ఖర్చుల భారం అధికంగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆర్థిక అక్షరాస్యత కొరత ఉంది. వేగంగా మారుతున్న ఆర్థిక వాతావరణంలో భారతీయ కుటుంబాల ఆర్థిక శ్రేయస్సు కోసం సంస్కరణల అవసరం కూడా ఉంది.
RBI ప్రకారం, క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్‌లు మార్చి 2023 చివరి నాటికి రూ.4,072 కోట్లకు పెరిగాయి.
2022 మార్చిలో రూ. 1.64 లక్షల కోట్ల క్రెడిట్ కార్డ్ బకాయిలు ఉండగా, 2023 మార్చిలో క్రెడిట్ కార్డ్ బకాయిలు రూ. 2.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
తాజాగా చేసిన ఒక అధ్యయనంలో క్రెడిట్ కార్డ్‌లపై ఉన్న మొత్తం FY21 నుండి FY23కి దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. లావాదేవీల విలువ కూడా రెండింతలు పెరిగింది.
క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్‌లు క్రెడిట్ స్కోర్‌లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. 7 సంవత్సరాల వరకు రికార్డ్‌లో ఉంటాయి. మీ భవిష్యత్ రుణ ప్రయత్నాలను క్లిష్టతరం చేస్తాయిన క్రెడిట్ కార్డ్‌లపై అధిక-వడ్డీ రేట్లు దాదాపు 42% వరకు ఉంటుంది. తక్కువ వ్యవధిలో బకాయి మొత్తాన్ని గణనీయంగా పెంచుతుంది క్రెడిట్ కార్డ్ కార్యకలాపాలు క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తారు. ఇది జారీ చేసే బ్యాంక్‌తో మాత్రమే కాకుండా మొత్తం క్రెడిట్ చరిత్రను ఇతర బ్యాంకులలో కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతి నెలా మీ క్రెడిట్ కార్డ్ బిల్లు కోసం కొంత మొత్తాన్ని కేటాయించండి. మీ క్రెడిట్ కార్డ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోండి . ఇష్టం వచ్చినట్లు కార్డులను తీసుకోకుండా.. కేవలం ఒక కార్డును మాత్రమే ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళండి.


Tags:    

Similar News