ర్యాంకుల వెనక మతలబు.? ఒక్క అరెస్టుతో అంతుచిక్కని ప్రశ్నలు, కార్పొరేట్‌కి కారుమబ్బులు!

ఒకటే రుబ్బుడు కార్యక్రమం అలవాటు చేసిన కార్పొరేట్ దందా.. తమ చదువుల నాణ్యతలో డొల్లతనాన్ని కూడా పసిగట్టేసిందనే చెప్పాలి.

Update: 2022-05-10 14:03 GMT

others

ఒకటి.. రెండూ.. మూడూ.. అన్ని ర్యాంకులూ మావే. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభంజనం.. ఇంటర్ ఫలితాల్లో నెంబర్ వన్ మేమే.. అంటూ ఊదరగొట్టే కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలపై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకొచ్చాయి. రాష్ట్రంలోనే పేరెన్నికగన్న విద్యాసంస్థల అధినేత క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారంలో అరెస్టు కావడం పెను సంచలనంగా మారింది. విద్యను వ్యాపారంగా మార్చేసిన కార్పొరేట్ మాయాజాలం ర్యాంకుల కోసం బరితెగిస్తోందా? ఎలాగైనా.. ఏం చేసైనా ర్యాంకుల పంట పండించడం.. వాటిని చూపించి కాసులు పిండుకోవడమే పనిగా పెట్టుకుందా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. వేల కోట్లకు పడగలెత్తిన విద్యావ్యాపార సామ్రాజ్యపు మూలాలపైనా సందేహాలను లేవనెత్తుతోంది.

నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ అరెస్టు మరిన్ని ప్రశ్నలను సంధిస్తోంది. దశాబ్దాల పాటు విద్యా రంగంలో ఓ వెలుగు వెలిగిన నారాయణ, చైతన్య సంస్థలపై ఏకంగా ప్రభుత్వాధినేతలే ఆరోపణలు చేయడం.. విచారణలోనూ సంచలన నిజాలు తెలిశాయని పోలీసులు సైతం వెల్లడించడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదని.. ఎప్పటి నుంచో ఈ మాల్ ప్రాక్టీస్‌ను వ్యవస్థీకృతం చేశారనే నిజాలు విద్యావ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టేసేలా ఉన్నాయి.

ర్యాంకుల కోసం అడ్డదారులు తొక్కుతూ.. పరమపదసోపానంలో నిచ్చెనలు ఎక్కుతూ ఎదిగిన వైనంపై ఒక్కసారిగా అనుమానపు మేఘాలు అలుముకున్నాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నా అంత సీరియస్‌ కాకుండానే సమసిపోయాయి. ఒకే రోజు వచ్చే పేపర్ యాడ్స్‌లో ఫలానా ర్యాంకర్ మా విద్యార్థేనంటూ సంస్థలు పోటీపడి మరీ ప్రకటనలిచ్చిన ఘటనలు చాలానే చూశాం. రెండు, మూడు దశాబ్దాలుగా విద్యా వ్యవస్థలో మకుటం లేని మహారాజులా ఎదుగుతూ వచ్చిన ఆ రెండు కార్పొరేట్ సంస్థలూ అందుకు అతీతమేమీ కాదు.

ఒకే ర్యాంకర్ మా వాడేనంటూ ప్రకటనలిచ్చి జబ్బలు చరుచుకున్న సందర్భాలున్నాయి. ఆ తర్వాత పోటీ పడడం ఎందుకు అనుకున్నారో.. లేక ఇద్దరూ కలిస్తే మంచిదనుకున్నారో కానీ ఒక్కటైపోయారు. ఒక హైబ్రిడ్ సంస్థను సృష్టించారు. కానీ ఆ తర్వాత కొన్నేళ్లకే విభేదాలొచ్చి రచ్చకెక్కారు. అధికార బలమున్న అధినేత ఆధిపత్యం భరించలేకపోతున్నామంటూ భాగస్వామ్య సంస్థ ప్రతినిధులు బహిరంగంగానే అసహనం వెళ్లగక్కారు. కానీ కార్పొరేట్ మూలాల జోలికి మాత్రం వెళ్లలేదని తాజా ఎపిసోడ్‌తో అవగతమవుతోంది.

ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్ వంటి అత్యున్నత చదువులను ఎరగా వేసి ఒకటే రుబ్బుడు కార్యక్రమం అలవాటు చేసిన కార్పొరేట్ దందా.. తమ చదువుల నాణ్యతలో డొల్లతనాన్ని కూడా పసిగట్టేసిందనే చెప్పాలి. ర్యాంకులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పనికిరావని అనుకున్నారేమో వాటిని పక్కన పడేసినట్లు అర్థమవుతోంది. కేవలం మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై ఫోకస్ ఉంటుందని.. మిగిలిన వాటిలో విద్యార్థులు వెనకబడతారని ఇలాంటి ప్రాక్టీస్ ఎంచుకున్నారని తేలడం నిజంగా విద్యావ్యవస్థకు పెనుప్రమాదమే. మాతృభాషను కూడా చూసి రాసుకోవాల్సిన పరిస్థితుల్లోకి నెట్టేస్తున్న ఈ దారుణాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు మరి!!


Tags:    

Similar News