రేపటి భీతి నేటి విచ్ఛిన్నానికి కారణమవుతోంది..!
బిజేపి పార్టీలో ఇమడలేకపోతున్న ఇద్దరు చరిష్మాటిక్ లీడర్లు విజయశాంతి, రఘునందన్ రావులు కాంగ్రెస్ పార్టీ
రోమ్.. తగలబడుతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడు. అది రోమ్ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం. యుద్ధనీతి తెలియని, రాజకీయ చాణక్షత ఎరుగని వాళ్ళని సాధారణంగా నీరో చక్రవర్తితో పోలుస్తుంటారు. ప్రస్రుతం తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి అలాంటి పరిస్థితుల్లోనే కనిపిస్తున్నారు అనిపిస్తోంది. కాకపోతే తగలబడుతున్న రోమ్ కాకుండా.. రేపు ఏమైపోతుందోనన్న భయంతో ఈరోజే తన ఆశయాల కోటని కూలగొట్టుకుంటున్నారు అనిపిస్తోంది. ఎలాగో చూడండి..
మే నెలలో జరిగిన కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి శుభ దశ మొదలైంది. రాష్ట్రంలోని అన్ని మూలల్లోనూ పార్టీ స్కోప్ అమాంతం పెరిగిపోయింది. నిస్సత్తువుగా ఉండిపోయిన గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఒక్కసారిగా పుంజుకుంది. కేవలం గంటల వ్యవధిలో ఆ పార్టీలోని అన్ని విభాగాలూ ఫుల్ జోష్‌లోకి వచ్చేశాయి. ఆశావహులు, సీనియర్ లీడర్ల హడావిడితో యావత్ పార్టీకి కొత్త కళ సంక్రమించింది. బయటి పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరాలనుకుంటున్నవాళ్ళ సంప్రదింపులు జోరందుకున్నాయి. వందలకొద్దీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌కు లైన్ కట్టి పార్టీ పెద్దల సమక్షంలో కండువాలు కప్పుకుంటున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలో తెలంగాణ కాంగ్రెస్ వచ్చే ఎన్నికలో ఫేవరేట్ గా మారిపోయింది. బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను ఓడించాలని ఎదురుచూస్తున్న ఎందరో సీనియర్ నేతలకు కాంగ్రెస్ పార్టీ కొత్త కల్పతరువులా కనిపిస్తోంది. చాలా మంది ప్రజాదరణ కలిగిన నేతలు, తమతో పాటు మరో నలుగురిని గెలిపించుకుంటామన్న నమ్మకం ఉన్న నేతలు జోరు ప్రచారాలతో హోరెత్తుతున్నారు. ఈసారి ఎన్నికలలో బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ చెమటలు పట్టిస్తుందనడంలో సందేహం లేకుండా చేశారు.
ఇంత వైభవంగా కాంగ్రెస్ పార్టీ రూపుదిద్దుకుంటుంటే.. ఆ పార్టీ ఛీఫ్ రేవంత్ రెడ్డికి మాత్రం లోలోపల గుబులు పుట్టింది. ఓ వైపు పార్టీలో చేరికలకు ఊతమిస్తూ యువ నాయకులని కలుపుకుని పోతున్న రేవంత్.. పార్టీలోని పాత నేతల విషయంలో మాత్రం భీతి కలిగి ఉన్నారు అనిపిస్తోంది. అదే కారణంతో మొన్నామధ్య పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్కకు, రేవంత్‌కు ఓ చిన్న కోల్డ్ వారే నడిచింది. భట్టితో పాటు ఉత్తమ్, జానారెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇలా అందరి విషయంలో రేవంత్‌కు ఏదో ఒక అంశంలో వాగ్వాదం జరుగుతోంది. తెలంగాణలో ఎప్పటికైనా సీఎం కావాలనుకుంటున్న రేవంత్‌కు ఈసారి అనుకోకుండా కాంగ్రస్ పార్టీకి పట్టిన మహర్దశ చూసి త్వరలోనే తన కల సాకారమవుతుందని భావించారు. కానీ అదే పార్టీలోని ఎందరో సీనియర్ నేతలు ఇప్పుడు రేవంత్‌కు కాంపిటేషన్ గా తయారయ్యారు.
భట్టి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌లు బాహాటంగా చెప్పకపోయినా.. అందరూ సీఎమ్ రేస్‌లో ఉన్నవాళ్ళే అని రాష్ట్రంలో అందరికీ తెలుసు. దాంతో.. ముగ్గురివల్ల తనకు పోటీ ఉండకూడదు అని ఏదో ఒక కారణంతో ఆ లీడర్ల గ్రాఫ్‌ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి మరియు అతని అనుచర వర్గం. ఈ కారణంతోనే సోషియల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల మీద పడుతున్న అభాండాలను రేవంత్ వర్గంవాళ్ళే రాయిస్తున్నారనే అభియోగాలు వ్యక్తమవుతున్నాయి.
రానున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రచార సారధిగా ఉత్తమ్ కుమార్ ను సెంట్రల్ కమిటీ శిఫార్సు చేసినట్టు తెలిసింది. ఇది ముందుగా తెలుసుకున్న ఓ వర్గం వాళ్ళు త్వరలోనే ఉత్తమ్ పార్టీని వీడుతున్నట్టు సోషియల్ మీడియాలో దుమారం రేపారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ మీడియా ముందుకు వచ్చి తనపై జరుగుతున్న కుట్రపూరిత వార్తలను ఖండిస్తూ వాటి వెనుక ఎవరున్నారనేది హింట్ ఇచ్చారు. ఉత్తమ్ తో పాటు మిగతా సీనియర్ లీడర్ల పై కూడా తరచూ తప్పుడు కథనాలను సృష్టిస్తూ పార్టీలో వాళ్ళ గ్రిప్‌ని తగ్గించాలనే కుట్ర జరుగుతోందని కొందరు సీనియర్లు చెప్తున్నారు.
ఇటీవల కాలంలో రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలను ఢిల్లీ వేదికగా తిరస్కరించుకుంటున్నారు ఆ పార్టీ సీనియర్ లీడర్లు. ఆస్ట్రేలియాలో రేవంత్ రెడ్డి వేసిన ఓ ఎన్నారై కమిటీని అదే రోజు సాయంత్రం నిలిపివేస్తున్నట్టు సెంట్రల్ పార్టీ ప్రకటించింది. ఆ సంఘటనతో రేవంత్‌కు, సీనియర్లకూ జరుగుతున్న కోల్డ్ వార్ బయటికి క్లియర్‌గా కనిపించింది.
ఉన్నవాళ్ళతోనే వేగలేకపోతున్నా అనుకుంటున్న రేవంత్‌కు బయట పార్టీల నుంచి వచ్చే ఆశావహులతో మరికొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైఎస్సార్టీపి అధ్యక్షురాలు షర్మిళ తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటిస్తే.. ఆమె పార్టీలో చేరాలి అనుకుంటే ఆమెను ఆంధ్ర రాజకీయాలకు కేటాయించాలే తప్ప తెలంగాణలో వద్దంటూ మొదట పేర్కొన్నది రేవంత్ అని ఆ పార్టీ వర్గాలవాళ్ళ ద్వారా తెలిసింది. షర్మిళ మాజీ ముఖ్యమంత్రి తనయ కాబట్టి.. అదీకాకుండా ఓ ప్రత్యేక పార్టీ స్థాపించి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న లీడర్ కాబట్టి ఆమె కాంగ్రెస్ లో చేరితే తనకు ఎసరు పెడుతుందని రేవంత్ ఆమెను అడ్డుకుంటున్నారు అని తెలుస్తుంది.
రెండు నెలల క్రితం వరకూ ఈటల, పొంగులేటిలు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న వార్తలు వెలువడ్డాయి. ఆ సందర్భంలో.. సిద్ధాంతాలను నమ్మకున్న పార్టీలోనే అధ్యక్ష పదవికోసం చిచ్చులు పెడుతున్న ఈటల.. లిబరల్ పార్టీ అయిన తమ పార్టీలోకి వస్తే తన సీట్‌కు ఎసరు పెట్టడని గ్యారంటీ ఏంటి అని తన సహచరులతో రేవంత్ చెప్పారట. బిజేపి వర్గాల్లో బిసీ సీఎం ప్రతిపాదన ఉంది కాబట్టి ఈటల సీఎం ఆశావాహి కనుక.. అతను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా సీఎం యాస్పిరెంట్ అవుతాడని రేవంత్ చెప్పినట్టు తెలిసింది. ఇది ఒక రకమైన ఆందోళనే కదా...! అనిపించింది.
బిజేపి పార్టీలో ఇమడలేకపోతున్న ఇద్దరు చరిష్మాటిక్ లీడర్లు విజయశాంతి, రఘునందన్ రావులు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే చేరదామనే ఆలోచనలో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ లీడర్లు కొందరు చెప్తున్నారు. ఇటీవల కాలంలో బిజేపి లో జరిగిన పరిణామాలు చూస్తే ఆ ఇద్దరూ అటువంటి ఆలోచన కలిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనిపిస్తుంది. పార్టీ కార్యకలాపాలలో రఘునందన్ యాక్టివ్ గా కనిపించినా.. విజయశాంతి మాత్రం తటస్తంగానే ఉన్నారు అనిపిస్తోంది. ఆ ఇద్దరు లీడర్ల పరిస్థితిని నాడే గమనించిన రేవంత్.. వాళ్ళిద్దరినీ కనీసం ఆహ్వానించే ప్రయత్నం చేయలేదు. కారణం.. తమ సీఎం సీట్‌కు మరో కాంపిటేషన్ ఎక్కడ మొదలవుతుందోనని.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినా కూడా సీఎమ్ సీట్ కోసం అంతర్గతంగా జరుగుతున్న డామినేషన్ గేమ్స్‌లో పార్టీ కార్యవర్గం దెబ్బతింటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రేవంత్ తన కలను సాకారం చేసుకోవాలంటే ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పనులు చేయాలి. రేపు తన సీట్ ఎసరు పెడతారు అనుకుంటూ ఈరోజే తన పార్టీ నేతలను వెనక్కు నెట్టాలనే ప్రయత్నం చేస్తే అసలుకే ఎసరు కలుగుతుందని రేవంత్ గుర్తించలేకపోతున్నారు. పొంగులేటి జాయినింగ్ రోజు సభలో రాహుల్ గాంధీ సమక్షంలో సభా సాక్షిగా ఒకరినొకరు తోసుకుంటూ పైపోటీగా ప్లకార్డులు ప్రదర్శించే ప్రయత్నం చేశారు. పార్టీలో సమన్వయ లోపం ఏమేర ఉందనేది స్పష్టంగా కనిపించింది. వీళ్ళ ఇంటర్నల్ వార్ ఇలానే కొనసాగితే.. పూవుల్లో పెట్టి అధికారాన్ని ఇస్తామనుకుంటున్న ప్రజల చేత ఆ అధికారాన్ని బీఆర్ఎస్ కే దక్కేలా చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్రున్నారు.
ఈ మంచి తరుణం కాంగ్రెస్ పార్టీకి కలిసి రావాలంటే ఢిల్లీ పెద్దలు వచ్చే వందరోజులు తెలంగాణలో మకాం వేసి తామే ఎన్నికల నిర్వహణను చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.