Ys Jagan : బొమ్మ కాదు బొరుసూ ముఖ్యమే... కేసీఆర్ ప్రయోగం విఫలం.. అందుకే జగన్?
తెలంగాణ ఎన్నికలు ముందు జరిగి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ కు మేలుకొలుపు తెప్పించాయి
తెలంగాణ ఎన్నికలు ముందు జరిగి ఏపీలో అధికారంలో ఉన్న జగన్ కు మేలుకొలుపు తెప్పించాయి. కేసీఆర్ కూడా తన బొమ్మను చూసి ఓటు వేస్తారని సిట్టింగ్‌లందరికీ దాదాపుగా సీట్లు కేటాయించేశారు. అందుకే అధికారానికి దూరమయ్యారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. సీఎం కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతతో పాటు ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి కూడా యాడ్ కావడంతోనే కేసీఆర్ ప్రగతి భవన్ ను వీడాల్సి వచ్చింది. ఫాం హౌస్ కు వెళ్లాల్సి వచ్చింది. అదే తరహాలో జగన్ కూడా చేస్తే ఇడుపుల పాయకు వెళ్లడం మినహా మరి చేసేదేమీ ఉండదు. అందుకేనే జగన్ కేసీఆర్ చేసిన ప్రయోగం విఫలం కావడంతో తాను ఆ తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
వదిలించుకునేందుకే...
దాదాపు యాభై మంది సిట్టింగ్ లను మార్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం. వరసగా వస్తున్న సర్వేల్లో ఈ విషయం వెల్లడి కావడంతో వారిని మార్చాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఎప్పటి నుంచో జగన్ చెబుతూనే వస్తున్నారు. టిక్కెట్ దక్కని వారికి అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని చెబుతున్నా వినే పరిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఉండదని తెలుసు. అయినా సరే వారిని వదిలించుకునేందుకే సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం తన బొమ్మతోనే తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని జగన్ కు ఆలస్యంగానైనా తెలిసిందంటున్నారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత సంక్షేమ పథకాలను డామినేట్ చేసే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నారు.
అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలను...
తన వారు... పరాయి వారు అని తేడా లేకుండా అసంతృప్తి ఉన్న వారందరినీ పక్కన పెట్టాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లే కనపడుతుంది. ఇందులో ఎవరికి మినహాయింపులు ఉండవని కూడా చెబుతున్నారు. మంత్రులయినా సరే.. టిక్కెట్ వచ్చేంత వరకూ ఈసారి డౌటే. మంత్రివర్గంలో కొందరికి సీట్లు దక్కవన్న ప్రచారం ఇప్పటి నుంచే పార్టీలో వినిపిస్తుంది. జగన్ కు అత్యంత సన్నిహితులైన మంత్రులు, విపరీతంగా అభిమానాన్ని చూపే వారికి సయితం ఆయన టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఇందులో మహిళ మంత్రులు కూడా ఇద్దరు ముగ్గురున్నారు. ఒకరిద్దరు మంత్రులను నియోజకవర్గాలను మార్చి పోటీ చేయించాలన్న నిర్ణయంలో కూడా జగన్ ఉణ్నారని అంటున్నారు.
కొందరికి ఎంపీగా....
లేకపోతే అసలుకే ఎసరు వస్తుందని ఆయన భావిస్తున్నారు. టిక్కెట్ ఇవ్వమని చెబితే ఉన్నోళ్లు ఉంటారు.. వెళ్లే వాళ్లు వెళతారు... ప్రత్యామ్నాయం నేతలను కూడా ఇప్పటికే ఎంపిక చేసుకుని మరీ జగన్ అడుగులు వేస్తున్నారని తెలిసింది. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉండటంతో కొందరు కీలక నేతలకు ముందుగానే టిక్కెట్లు రావని చెప్పడం ఒక విధానమయితే... మరికొందరికి చివరి నిమిషంలో చెప్పేలా ప్లాన్ చేసుకున్నారట. అలాగే కొందరు మంత్రులను ఎంపీలుగా కూడా పోటీ చేయించాలన్న ఆలోచనలో వైసీపీ అధినేత ఉన్నట్లు వినికిడి. మొత్తం మీద కేసీఆర్ ఓటమి జగన్ లో పెద్ద మార్పు తెచ్చిందన్నది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మరి చివరకు ఎవరికి టిక్కెట్ దక్కుతుందో? ఎవరికి దక్కదో? అన్నది నేతల్లో టెన్షన్ మొదలయింది.