Vangaveeti Radha : తండ్రి పరువు తీశావు కదయ్యా.. ఈ దేబిరించడం దేనికి?
వంగవీటి రాధా ఈ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఆయన ప్రచారానికే పరిమితం కానున్నారు
Vangaveeti Radha :పుట్టింది వంగవీటి కుటుంబంలో.. కానీ తండ్రి పరువును తీసేస్తున్నాడంటూ వంగవీటి రంగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆయన కుమారుడు రాధాపై ఫైర్ అవుతున్నారు. ఇంటి పేరు వింటేనే చెవుల్లో రీసౌండ్ వస్తుంది. అందులోనూ బెజవాడలో ఇప్పటికీ వంగవీటి రంగా అంటే ఎవరూ మర్చిపోరు.. మర్చిపోలేరు కూడా. కేవలం కాపు సామాజికవర్గానికే కాదు పేదలకు కూడా రంగా చేసిన సేవలను ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. జనరేషన్‌లు మారినా రేంజ్ తగ్గని ఒకే ఒక నేత వంగవీటి రంగా. ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుని అనేక మంది నేతలు రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
స్వయంకృతాపరాధమేనా?
కానీ ఆయన తనయుడు వంగవీటి రంగా మాత్రం తండ్రి పరువును తీస్తున్నారంటూ రంగా అభిమానులు మండిపడుతున్నారు. ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అనేక పార్టీలు దాదాపుగా టిక్కెట్లను ప్రకటించాయి. టీడీపీ, జనసేన, వైసీపీలు ఇటు ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. జనంలోకి కూడా వెళుతున్నాయి. కానీ ఎక్కడా వంగవీటి రాధా ఊసే లేదు. బెజవాడలో ఆయన పేరును పార్టీలు పూర్తిగా చెరిపేసినట్లే అయింది. ఎవరూ పట్టించుకోకపోవడానికి కారణం రాధా చేసుకున్న స్వయంకృతాపరాధమే కారణమని చెప్పక తప్పదు. ఇంటి పేరు చూసి పార్టీలు ఇంటికి వచ్చి టిక్కెట్లు ఇవ్వాల్సిన కుటుంబంలో పుట్టిన వంగవీటి రాధా పార్టీ నేతల వద్దకు పరుగులు తీయడం పరువు తీసే విధంగా ఉందంటున్నారు.
ఇంటికి టిక్కెట్ నడచి రావాల్సిన...
పార్టీలు మారడంలో తప్పు లేదు. కానీ చట్టసభల్లో కాలు మోపడానికి అవసరమైన సత్తాను సొంతం చేసుకోవాలి. వంగవీటి రాధా అంటే అన్ని పార్టీలూ లేచి నిల్చుని సెల్యూట్ చేసేలా ఉండాలి. కానీ దానికి రివర్స్ లో రాధా రాజకీయం నడుస్తుంది. చివరకు జనసేనలో నాదెండ్ల మనోహర్ ను కలసి చర్చించాల్సిన పరిస్థితులు వచ్చాయంటే దీనికి కారణాలేంటన్నది రాధా ఆలోచించుకుంటే మంచిదన్న కామెంట్స్ ఆయన అనుచరుల నుంచే వినిపిస్తున్నాయి. ఎవరో ఇచ్చే ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం పార్టీ కార్యాలయాల చుట్టూ తిరగడం అవసరమా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. తనకు, తన కుటుంబానికి ఉన్న ఇమేజ్ ను కాపాడుకోవడంలో రాధా రాజకీయంగా ఫెయిలయ్యాడంటున్నారు.
ఇవే కారణాలా?
జనంలో తిరగకపోవడం, సొంత అనుచరులను కాపాడుకోక పోవడం వంటి తప్పిదాలు వంగవీటి రాధాను రాజకీయంగా బలహీన పర్చాయని చెబుతున్నారు. టీడీపీలో ఉన్నారన్న మాటే కానీ ఆ పార్టీలోనూ యాక్టివ్ గా లేరు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటే టీడీపీలో చేరిన రాధా అందుకు తలాడించి వచ్చేశారు. పార్టీ అధికారంలోకి రాలేకపోవడంతో ఆ పదవికి దూరమయ్యారు. పోనీ జనసేనలో చేరారా? అనుకుంటే అందులోకి వెళ్లలేకపోయారు. కారణాలేవైనా రాధా రాజకీయ జీవితం ఆయన చేతుల్లో లేకుండా పోయింది. పార్టీలు ఇష్టపడి ఏదైనా పదవి ఇస్తే ఇచ్చినట్లు.. లేకపోతే మాత్రం ఇక అంతే. ఇది వంగవీటి అభిమానులకు మాత్రం రుచించడం లేదు. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా ఆయన కేవలం ప్రచారానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.