Revanth Reddy : విక్రమార్కను వదలడం లేదుగా.. అదేనా సీక్రెట్?

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి దాదాపు ఇరవై రోజులవుతుంది. అయితే పాలన పరంగా రేవంత్ మంచి మార్కులే కొట్టేశారు

Update: 2023-12-26 07:42 GMT

revanth reddy, mallu bhatti vikramarka

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించి దాదాపు ఇరవై రోజులవుతుంది. అయితే పాలన పరంగా రేవంత్ మంచి మార్కులే కొట్టేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండింటిని గ్రౌండ్ చేశారు. మరో నాలుగు గ్యారంటీలను అమలు చేయడంపై కసరత్తులు చేస్తూనే ఆర్థిక పరిస్థితిపై అంచనాకు వస్తూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అయ్యారు కానీ...అయితే ఆయన ఉన్నది ప్రాంతీయ పార్టీలో కాదు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో. అదే ఆయన భయం. కాంగ్రెస్ లో కుర్చీ ఎవరికి ఎంత సమయం అన్నది ఎవరికీ తెలియదు. గతంలో ఉన్న దూకుడు లేదు. భాషలో పదును లేదు. అంతా సౌమ్యంగానే రేవంత్ సాగుతున్నారు.

ముందు జాగ్రత్తగా...
అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిని అయ్యాను ఇక తనదే పై చేయి అన్న రీతిలో ఆయన సాగడం లేదు. అందరినీ కలుపుకుని పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు ప్రభుత్వ పరంగా తన సహచర మంత్రులకు ఆయన అన్నింటిలోనూ భాగస్వామ్యం కల్పిస్తున్నారు. శాఖల వారీగా సమీక్షల్లో కావచ్చు. వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా కావచ్చు. మంత్రులను ఎవరినీ నిర్లక్ష్యం చేయడం లేదు. మంత్రులనే కాదు ఎమ్మెల్యేలను కూడా ఆయన తక్కువ చేసి చూడటం లేదు. అందరితో కలవిడిగా ఉంటున్నారు. వారు కోరిన వెంటనే అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు.
బొటా బొటీ స్థానాలతో...
కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. పైగా బొటా బొటీ స్థానాలతో కాంగ్రెస్ గత ఎన్నికల్లో నెగ్గింది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లోనే గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు మాత్రమే. అందుకే రేవంత్ రెడ్డి అందరివాడిగానే ఉండాలి. ఉండి తీరాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు. అందుకే ప్రతి అంశంలోనూ రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏ నిర్ణయాన్నైనా తనపైన వేసుకునే సాహసాన్ని ఆయన చేయడం లేదు. గుంపుగానే వెళ్లాలి.. సమిష్టి నిర్ణయమే బయటకు రావాలి.. హైకమాండ్ ఏం చెబితే అదే తాను చేశానంటూ పార్టీ నేతలకు చెప్పుకునే వీలుండేలా ఆయన అడుగులు పడుతున్నాయి.
వదిలపెట్టకుండా...
అంతే కాదు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ప్రతి అంశంలోనూ ఇన్‌వాల్వ్ చేస్తున్నారు. ఏదైనా తేడా వస్తే తనకు ఫస్ట్ స్ట్రోక్ భట్టి నుంచి వస్తుందని ఆయనకు తెలియంది కాదు. అందుకే ప్రతి విష‍యంలోనూ భట్టికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రగతి భవన్ సాధారణంగా ముఖ్యమంత్రి నివాసం ఉండాల్సి ఉన్నా దానిని భట్టికే వదిలేశారు. తర్వాత కీలకమైన ఆర్థిక శాఖను కూడా ఆయన చేతిలో పెట్టేశారు. అంతేకాదు ఇప్పుడు ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీకి వెళుతున్నా భట్టిని తోడ్కొని వెళుతున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ భట్టి ప్రమేయంతోనే పార్టీ పెద్దలతో చర్చలు జరపాలని రేవంత్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం. అందుకే ఆయన భట్టితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. ఏదైనా మంచి జరిగినా.. చెడు జరిగినా ఫిఫ్టీ ఫిఫ్టీ భరించేలా రేవంత్ సీన్ క్రియేట్ చేస్తున్నట్లే కనపడుతుంది.


Tags:    

Similar News