చంద్రబాబుకి ఓ కంట పన్నీరు.. ఓ కంట కన్నీరు

పవన్ కళ్యాణ్ మూడు రోజుల కిందట ప్రారంభించిన వారాహి విజయ యాత్ర అనూహ్యంగా ముందుకు సాగుతోంది. ఈ విషయం తెలుగు దేశానికీ కొంత ఊరట కలిగిస్తున్నా, మరో వైపు ఇబ్బంది కూడా పెడుతోంది.

Update: 2023-06-18 13:19 GMT

పవన్ కళ్యాణ్ జూన్ 14న ప్రారంభించిన వారాహి విజయ యాత్ర ఊహించిన దానికంటే విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ విషయం తెలుగు దేశానికీ కొంత ఊరట కలిగిస్తున్నా, మరో వైపు ఇబ్బంది కూడా పెడుతోంది.  ఎన్నికల్లో పవన్ ఇమేజ్ తమకు ఉపయోగపడుతుందని వాళ్ళు భావిస్తూ ఉండొచ్చు. కానీ యాత్రలో అనూహ్య జన స్పందన దేశం నేతల పునరాలోచనలో పడేస్తోంది. యాత్ర సందర్భంగా చేస్తున్న ప్రసంగాల్లో పవన్ కళ్యాణ్ తనని సీఎం చేయాలని అభిమానులను అభ్యర్థిస్తున్నారు. వైకాపా నేతలకు కొన్నిసార్లు సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. మరికొన్నిసార్లు వెటకారంతో వాళ్లని ఇరుకుని పెడుతున్నారు.  పవన్ ప్రసంగాలకు ఆయన అభిమానులతో పాటు, స్థానికులు కూడా చప్పట్లతో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. యువగళం పేరుతో లోకేష్ చేస్తున్న పాదయాత్రకు ఈ స్థాయిలో స్పందన లేకపోవడం తెలుగుదేశం వర్గాలను ఇరుకుని పెడుతోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉండొచ్చు. భవిష్యత్తులో ఆయన రాష్ట్రమంతా పర్యటించిన తర్వాత జనం స్పందన చూసి అసెంబ్లీ సీట్లు బేరసారాలకు దిగొచ్చు.  ఓ పదో, ఇరవయ్యో సీట్లు ఇచ్చి జనసేన అభిమానులను తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనుకున్న తెలుగుదేశం పార్టీ ఆశలకు వారాహి విజయ్ యాత్ర కళ్ళెం వేస్తున్నట్లు ఉంది. తమ షేర్ సీట్లను పెంచమని జనసేన కోరవచ్చు. యాభై నుంచి బేరం మొదలు పెట్టె అవకాశాలు ఉన్నాయి. ఇలా అయితే చంద్రబాబు నిజంగా ఇరుకున పడతారు.  

చంద్రబాబుకు ఉన్న మీడియా మద్దతు పవన్ కళ్యాణ్ కి లేదు. ప్రస్తుతం కూడా చంద్రబాబుని సపోర్ట్ చేసే మీడియా వారాహి విజయ యాత్రను పెద్దగా హైలైట్ చేయడం లేదు. పవన్ వైకాపా నాయకులను, ముఖ్యానంగా ముఖ్యమంతి జగన్ ని తిడితే బాగా హైలైట్ చేస్తోంది. లోకేష్ పాదయాత్రకి ఇచ్చిన ప్రాధాన్యతని వారాహి విజయ యాత్రకు ఇవ్వడం లేదు.  పొత్తుల విషయంలో పవన్ ను వెనక్కి లాగేది చంద్రబాబుకి ఉన్న మీడియా బలం మాత్రమే. బయటకు చెప్పలేక పోతున్నా వారాహి విజయ యాత్ర మాత్రం తెలుగు దేశానికి ఒకేసారి మోదాన్ని, ఖేదాన్ని కలిగిస్తున్నాయి. 

Tags:    

Similar News