Kesineni Nani : పోటీ ఖాయమట.. దెబ్బతీయడమే లక్ష్యం.. తాను నిలబడి వారిని ఓడించడమే?
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు దిగేందుకు సిద్ధమవుతున్నారు
Kesineni Nani:విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా ఆయన ఎన్నికల బరిలో ఉండేందుకు సన్నాహాలు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ జెండాలను తన కార్యాలయం నుంచి తొలగించిన కేశినేని నాని త్వరలోనే పార్టీకి కూడా రాజీనామా చేయనున్నారు. అయితే ఆయన ఏ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేశినేని నాని వరసగా ముఖ్య నేతలు, తన సన్నిహితులతో సమావేశాలు జరుపుతున్నారు. వారితో ఏకాంతంగా చర్చలు సాగిస్తున్నారు.
టీడీపీని ఓడించడమే...
చర్చల సారాంశం ఒక్కటే. తాను గెలిచినా.. గెలవకపోయినా.. టీడీపీని ఓడించి తీరాలి. అదే లక్ష్యంతో పనిచేయాలని నేతలకు, సన్నిహితులకు ఆయన సూచిస్తున్నట్లు తెలిసింది. తనకు పార్టీలో జరిగిన అవమానాలను కూడా ఆయన సమావేశాల్లో సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలిసింది. తనను ఎన్ని మాటలన్నా వారిని ఏమీ అనకుండా అధినాయకత్వం మౌనంగా ఉండటాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి ట్రాప్ లో పార్టీ నాయకత్వం పడిపోయిందని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తాను అందరినీ కలుపుకుని పోవాలని ప్రయత్నిస్తే వారు తనను వేరుగా చూసి తన ఇంట్లో పార్టీ నగర కార్యాలయాన్ని కూడా తొలగించడం దగ్గర నుంచి కార్పొరేషన్ ఎన్నికల వరకూ జరిగిన అన్ని విషయాలను ఆయన చెబుతున్నారు.
వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా...
అయితే ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం ఉందని కొందరు చెబుతున్నారు. అయితే వైసీపీలో చేరే ఆలోచన కేశినేని నానికి లేదంటున్నారు. మరోవైపు బీజేపీలో చేరాలని కూడా కొందరు సన్నిహితులు వత్తిడి తెస్తున్నారు. బీజేపీ లో చేరి విజయవాడ పార్లమెంటుకు పోటీ చేస్తే మంచిదన్న సూచనలు కూడా కేశినేని నానికి అందుతున్నాయి. అయితే నేతలు, సన్నిహితుల నుంచి అందరి అభిప్రాయాలను తీసుకుంటున్న నాని తాను త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు. అయితే పోటీ చేయడం గ్యారంటీ అని కూడా వారందరికీ చెబుతుండటం విశేషం. తనకు పోటీగా తన సోదరుడు కేశినేని చిన్నిని ఎవరు ఇక్కడకు రప్పించారో కూడా తనకు తెలుసునని ఆయన అన్నారు. వారందరికీ గుణపాఠం చెప్పే పరిస్థితి త్వరలోనే ఉంటుందని ఆయన వారికి నచ్చ చెబుతున్నారని సమాచారం.
స్వతంత్ర అభ్యర్థిగానే...
కానీ కేశినేని నాని ఈసారి స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగి అటో ఇటో తేల్చుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు. తాను స్వతంత్రంగా నిలబడితే తనకు పడే ప్రతి ఓటు టీడీపీకి పడే ఓట్లు కావడంతో ఆ పార్టీ తరుపున బరిలోకి దిగిన అభ్యర్థి ఓడిపోతారని కేశినేని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అలా కాకుండా టీడీపీ కూటమిలో బీజేపీ చేరకపోతే మాత్రం తాను బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నించాలని కూడా ఆయన అనుకుంటున్నట్లు సన్నిహితులు ఆఫ్ ది రికార్డుగా అంటున్నారు. కేశినేని నానిలో ఒకటే కసి. అది తనను అన్యాయంగా బయటకు వెళ్లగొట్టిన టీడీపీని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఓడించడమే. అదే లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. మరి రానున్న కాలంలో జరగనున్న రాజకీయ పరిణామాలను బట్టి నాని ప్రయాణం ఆధారపడి ఉండనుంది.