'గౌరవప్రదమైన' సీట్లు అంటే ఎన్ని? పొత్తుల ప్రతిష్టంభనకు కారణం ఏమిటి?
పొత్తుల్లో భాగంగా జనసేన కాంక్షిస్తున్న గౌరవప్రదమైన సీట్ల సంఖ్య ఎంత ? 30? 40? 50? 60? 70? ఈ సంఖ్యలలో ఏదీ స్పష్టత లేదు
పొత్తుల్లో భాగంగా జనసేన కాంక్షిస్తున్న గౌరవప్రదమైన సీట్ల సంఖ్య ఎంత ? 30? 40? 50? 60? 70? ఈ సంఖ్యలలో ఏదీ స్పష్టత లేదు. శ్రీకాకుళం 'రణస్థలం' నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల నగారా మోగించిన నాటి నుంచి మొన్న తణుకు వరకు జరిగిన వారాహి యాత్రలోనూ 'ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను' అనే ప్రతిజ్ఞకే కట్టుబడి ఉన్నారు.ఒంటరి పోరుకు తన బలం సరిపోదని ఆయనకు తెలుసు.ఒంటరిగా పనిచేసి, పోరాడి... వీర మరణం చెందాల్సిన అవసరం లేదని ఆయనే అంటున్నారు.జనసేనాని మాటల్లో పదును పెరిగింది.ఆలోచనాధోరణిలో మార్పు కనిపిస్తోంది.ప్రసంగాల్లో రాజకీయపరిపక్వత కనిపిస్తోంది.
జనసేన పార్టీ ప్రయాణాన్ని 7 దశలుగా విభజించాలి.1.2014 లో టీడీపీ,బీజేపీలకు వెన్నుదన్నుగా నిలబడి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం.2.ఒంటరిగా పోటీ చేసి ఘోరపరాజయాన్ని మూటకట్టుకోవడం.3.జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీతో జట్టు కట్టడం.4.జగన్ ను గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకోవడం.5.వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చేస్తానని భీషణ ప్రతిజ్ఞ చేయడం.6.వారాహి యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్లి జగన్ కు వ్యతిరేకంగా భావజాలాన్ని వ్యాప్తి చేయడం.7.ఎన్ డి ఏ మిత్రపక్షాల సమావేశంలో పాల్గొనడం.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బిజెపి మిత్రునిగా పవన్ కళ్యాణ్ పేరుప్రఖ్యాతులు ఢిల్లీలో మార్మోగాయి.కానీ దాంతో తన మైదానమైన ఏపీలో రాజకీయంగా పెరిగిన ప్రతిష్ట ఏమిటి? కేంద్రంలో అధికారంలో ఉన్నందున బీజేపీతో కొనసాగితే జగన్ దూకుడుకు కళ్లెం వేయవచ్చునని చంద్రబాబు అభిప్రాయం.సరిగ్గా అదే భావనతో పవన్ ఉన్నారు.
తెలుగుదేశం పార్టీతో మౌలికంగా జనసేన సంసిద్ధమే అని పలు సందర్భాలలో పవన్ సంకేతాలు ఇస్తున్నారు.పొత్తు ఏదైనా సీట్ల పంపిణీ లో 'గౌరవప్రదంగా'నే సాధిస్తామని,జనసైనికుల ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూస్తామని ఆయన అంటున్నారు.ఇప్పటికి మూడు సందర్భాలలో పవన్,చంద్రబాబు సమావేశాలు జరిగాయి.పరస్పర పరామర్శలు,ఓదార్పు యాత్రలు జరిగాయి.స్థూలంగా ఇద్దరి మధ్య ఒక అవగాహన కుదిరిందని అందరూ భావించారు.ఇదంతా వారాహి యాత్రకు ముందే.నిజానికి వారాహి యాత్ర రెండు దశల్లోనూ విజయవంతమైనందుకు,పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్సు అద్భుతంగా ఉన్నందుకు గాను పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు స్వయంగా కలిసి అభినందించవలసి ఉంది.ఆ పని చంద్రబాబు చేయలేదు.కారణం ఈగో కావచ్చును.
అయితే దెబ్బ మీద దెబ్బలా తన మిత్ర పక్షాల సమావేశానికి టీడీపీ అధ్యక్షుడ్ని పిలవలేదు.పైగా జనసేన అధినేత పవన్ ను ఆహ్వానించారు.ఆ సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చిన నాటి నుంచి పవన్ కళ్యాణ్,చంద్రబాబు మధ్య సమావేశం జరగలేదు.ఇద్దరి మధ్య మాటామంతీ లేదు.ఇద్దరూ ఎవరికి వారే తమ సొంత ప్లానింగు చేసుకుంటున్నారు.తమ పార్టీల అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు చేసుకుంటున్నారు.కానీ రెండు పార్టీల శ్రేణులు,నాయకులు సందిగ్ధంలో ఉన్నారు.అయోమయానికి లోనవుతున్నారు.పొత్తులపై నెలకొన్న అస్పష్టత తొలగిపోనంతవరకు ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంటుంది.
ఇదివరకటిలా కాకుండా జనసేన నాయకుడిలో,కార్యకర్తలు,అభిమానుల్లో ఒక తేడా కనబడుతోంది.పార్టీ విధానాల నుంచి అనుసరించే వైఖరి,ప్రత్యర్థుల్ని ఖండించే పద్ధతి వరకు మాటల్లో వివేకం,పరిపక్వత కనిపిస్తున్నవి.ముక్కుసూటితనం పంథాను పవన్ విడనాడారు. పొత్తులకు అనుకూలంగా పార్టీ శ్రేణులు,అభిమానులు,సాధారణ జనం నుంచి మద్దతు కూడగట్టేందుకు తన వారాహి యాత్ర లో పవన్ బలంగా ప్రయత్నించారు.2019 ఎన్నికల్లో 53 నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీలడం వల్ల టీడీపీ 23 స్థానాలకు పరిమితమైపోయింది. రెండు చోట్ల ఓడిపోయానని తనను అవమానిస్తూ మాట్లాడతారని,వాటిని తాను 'యుద్ధంలో గాయాలు'గానే భావిస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు.
ఒకప్పుడు చంద్రబాబును కూడా పవన్ అభిమానులు తీవ్రంగా విమర్శించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వొద్దన్న పవన్ కళ్యాణ్ నినాదానికే ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.18 అసెంబ్లీ సీట్లు గెలిచిన అన్న చిరంజీవి,ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.అలాంటి అపోహలకు తావు లేకుండా ఎన్నికల్లో ఓటమి పాలయినా సరే,నాలుగున్నరేళ్లుగా తమ నాయకుడు పవన్ పార్టీని నడుపుతున్నాడనే భరోసాను కార్యకర్తలలో కలిగించారు.
పొత్తుల విషయంలో జనసేన నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.కనీస ఉమ్మడి కార్యక్రమం ఉండాలని అన్ని స్థాయిల్లో రాజకీయ ఎజెండా ఉండాలనే వ్యూహం రచిస్తున్నది.అన్ని పదవుల్లోనూ దామాషా పద్ధతిలో వాటా న్యాయంగా దక్కాలని పవన్ భావిస్తున్నారు.ఎమ్మెల్యే లేదా ఎంపీ టిక్కెట్టో ఒక పార్టీకి దక్కితే, దాని పరిధిలో ఉండే మిగతా ముఖ్యమైన రాజకీయ అవకాశాలు భాగస్వామ్య పక్షానికి దక్కాలని జనసేన ప్రతిపాదిస్తోంది.
'పొత్తులు ఎందుకు ?...' అనే అంశంలో రాష్ట్ర ప్రజల్ని కన్విన్సు చేసేలా జనం ఆమోదించేలా జనసేన ఫార్ములా ఉండాలని జనసైనికులు భావిస్తున్నారు.2014లో జనసేన టీడీపీకి మద్దతిచ్చింది.ఎన్నికల్లో పోటీ చేయలేదు.అందువల్ల జనసైనికులెవరూ ఆర్థికంగా చితికిపోయిన దాఖలాలు లేవు. కానీ,2019 లో పోటీ చేయడంతో రాష్ట్రంలో జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు పార్టీకోసం ఎంతో ఖర్చు చేశారు.వాళ్ళను సంతృప్తి పరచాల్సిన బాధ్యత జనసేన నాయకత్వంపై ఉన్నది. 2014లో కుదిరిన సయోధ్య, 2019 లో కుదరకపోవడానికి బాబు కుమారుడు లోకేష్ వ్యవహార శైలే కారణమని ప్రచారం సాగింది.పవన్‌తో జరిపిన భేటీల్లో లోకేష్ లేకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారని కొందరు చెబుతున్నారు.