గోదారి తీరమే నిర్ణయాత్మకమా..?
ఇంకా ఎన్నికలకు పది నెలల సమయం ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఇప్పట్నుంచే వేడెక్కుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి..
రెండు జిల్లాల నుంచే 20 శాతం సీట్లు
ఇంకా ఎన్నికలకు పది నెలల సమయం ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఇప్పట్నుంచే వేడెక్కుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించడం, గోదావరి జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అధికార పార్టీ మీద ఘాటైన విమర్శలు చేయడం ఎన్నికల సీజన్‌ను తలపిస్తున్నాయి. పవన్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రతి విమర్శలు చేయడం, ఓ దశలో స్వయంగా ముఖ్యమంత్రి జనసేనానిఇ పెళ్ళిళ్ల గురించి మాట్లాడటం.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌ను రసకందాయంగా మారుస్తున్నాయి.
పవన్ తన ప్రసంగాల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 34 సీట్లలో ఒక్కటి కూడా వైసీపీకి దక్కనివ్వబోమని చెబుతున్నారు. తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? పొత్తులతో ముందుకు వెళ్తుందా అనే విషయమై ఆయన క్లారిటీ ఇవ్వడం లేదు. వైకాపాను గెలవనివ్వబోమని చెప్పడమంటే, అన్ని సీట్లకూ తాము పోటీ చేయడం కాదనే వాదన కూడా వినిపిస్తోంది.
గోదావరి జిల్లాల్లో మొత్తం 34 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో 20 శాతం సీట్లు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలే అందిస్తున్నాయి. సాధారణంగా గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే ప్రచారం ఉంది. గత ఎన్నికలన్నీ ఈ విషయాన్నే ధృవీకరించాయి. ఈ జిల్లాల్లో కాపుల తర్వాత ఎస్సీ సామాజికవర్గానిదే పై చేయి. అందుకే కొన్ని నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ అయి ఉంటాయి. దాదాపు అన్ని నియోకవర్గాల్లో కాపులు నిర్ణయాత్మక శక్తిగానే ఉంటారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా తన వారాహి యాత్రలో గోదావరి జిల్లాల మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. 34 సీట్లూ వైకాపాకు దక్కనివ్వనని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.
టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే ఈ జిల్లాల నుంచే జనసేన ఎక్కువ సీట్లను డిమాండ్ చేయవచ్చనే వాదన వినిపిస్తోంది. రెండు పార్టీలు కలిసి గోదావరి జిల్లాల్లో 25 సీట్లు సాధించి, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో 65 సీట్లు దక్కించుకున్నా అధికారం చేజిక్కుంచుకోవచ్చనేది ఇరు పార్టీల అగ్రనాయకుల ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. నారా లోకేష్ యువగళం పాదయాత్ర, తెలుగుదేశం నేతల బస్సు యాత్రలకు, గోదావరి జిల్లాల్లో పవన్ మ్యాజిక్ కూడా తోడైతే అధికారం సులువుగానే దక్కవచ్చనేది వారి ఆలోచన. వీరికి బీజేపీ కూడా కలిస్తే వైకాపాను సులువుగా ఇంటికి పంపవచ్చనేది రాబోయే ఎన్నికల వ్యూహం కావచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.