వారికి నో టిక్కెట్
వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ పార్టీలో కాక రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలయింది
వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ పార్టీలో కాక రేపుతున్నాయి. ఎంత మందికి టిక్కెట్ రాదు? ఎంతమందికి వస్తాయి? టిక్కెట్ ఇవ్వడానికి ప్రాతిపదిక ఏంటి? కేవలం సర్వేలేనా? సామాజిక కోణంలోనూ టిక్కెట్ల కేటాయింపు ఉంటుందా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కలవరం రేపుతున్నాయి. నిన్న జగన్ చేసిన కామెంట్స్ పై ఏమీ మాట్లాడలేక కొందరు.. తన సన్నిహితుల వద్ద మరికొందరు తమ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. టిక్కెట్ దక్కకపోతే పార్టీని వీడి వెళ్లిపోతే ప్రయోజనమేంటి? జగన్ మళ్లీ తమను ఆదరిస్తారా? లేక పోటీ చేయాలా? అన్న దానిపై ఇప్పటికే కొందరు తర్జన భర్జన పడుతున్నారు.
మార్పు తప్పదని...
వైసీపీ అధినేత జగన్ కొందరికి టిక్కెట్ దక్కకపోవచ్చని చెప్పేశారు. ఎంతమందికి అన్నది ఆయన స్పష్టంగా చెప్పకపోయినా ఎక్కువ సంఖ్యలోనే మార్పులుంటాయని భావిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడాలంటే మార్పు అవసరమని జగన్ విశ్వసిస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి సీట్ల సంఖ్య కూడా పెరుగుతాయి కాబట్టి అప్పుడు అందరికీ టిక్కెట్లు దక్కే అవకాశముందని కూడా కొందరితో చెప్పినట్లు తెలిసింది. వారంతా ఐదేళ్ల పాటు వెయిట్ చేయకుండా ఏదో ఒక నామినేటెడ్ పదవిని కట్టబెట్టడతామని హామీ ఇస్తున్నారు. వీటితో వారు సంతృప్తి పడతారా? లేక ఇతర మార్గాలను వెదుకుతారా? అన్నది తేలాల్సి ఉంది.
సర్వేలతో పాటు...
జగన్ ఏదైనా నిర్మొహమాటంగా ఉంటారు. తాను టిక్కెట్ ఇవ్వనంటే ఇవ్వనని చెప్పేస్తారు. అదే సమయంలో స్పష్టమైన హామీ ఇస్తారు. ఆ హామీని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారన్నది పార్టీలో ఉన్న అభిప్రాయం. తాను హామీ ఇచ్చిన, ఇవ్వకపోయినా కొందరికి పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. శానససభకు టిక్కెట్ ఇవ్వని వారిని కొందరికి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయించాలన్న యోచనలో ఉన్నారు. అలాగే కొందరు సిట్టింగ్ పార్లమెంటు సభ్యులను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించే ఆలోచన కూడా చేస్తున్నారు. తాము అనుకుంటున్న అభ్యర్థిపై కూడా సర్వేలు చేయిస్తున్నారు.
బీసీలకే ఎక్కువ....
అయితే కేవలం సర్వేలు మాత్రమే కాకుండా సామాజికవర్గాల సమీకరణకు కూడా జగన్ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రధానంగా ఎక్కువ బీసీ సామాజికవర్గానికి ఎక్కువ స్థానాలను కేటాయించే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. బీసీ ఓటు బ్యాంకును ఇప్పటికే పటిష్టం చేసుకున్న జగన్ ఈసారి ఆ వర్గానికి ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించి ఆ సామాజికవర్గాన్ని మొత్తాన్ని తన వైపునకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికి ఈసారి టిక్కెట్లు తక్కువగా దక్కే అవకాశాలు లేకపోలేదు. అందుకే తనకు సన్నిహితులైన కొందరిని ఈసారి పక్కన పెట్టాలన్న యోచనలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి పదవులు ఇచ్చే ప్రాతిపదికన ఫార్ములాను రూపొందిస్తున్నారు. ఈసారికి రెడ్డి సామాజికవర్గం నేతలు కొంత తగ్గి ఉండాలని జగన్ కోరనున్నారని చెబుతున్నారు.