ఆమె 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక ఫైనల్స్‌లో 5వ స్థానంలో నిలిచిన భారత మహిళల 4 X 100 మీటర్ల రిలే జట్టులో కూడా భాగంగా ఉంది. 2022 భారత జాతీయ క్రీడలలో, ఆమె 100 మీటర్లు పరుగు, 100 మీటర్ల హర్డిల్స్ రెండింటిలోనూ స్వర్ణాన్ని గెలుచుకుంది. 2023 ప్రారంభంలో, ఆస్తానాలో జరిగిన 2023 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలవడమే కాకుండా, ఇండోర్ 60 మీటర్ల హర్డిల్స్‌లో ఆమె జాతీయ రికార్డును బద్దలుకొట్టింది.
ఏడేళ్ల క్రితం హైదరాబాద్ SAIలో జ్యోతి యర్రాజి అడుగుపెట్టింది. పొడవైన అమ్మాయి కావడంతో లాంగ్ జంప్, హైజంప్, జావెలిన్ త్రో ప్రయత్నించమని చాలా మంది అడిగారు. కానీ ఆమె వాటి కంటే హర్డిల్స్ మీదనే దృష్టి పెట్టింది. జ్యోతి ఇప్పుడు భారతదేశంలోనే 100 మీటర్ల హర్డిల్స్ లో ది బెస్ట్ గా నిలిచింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో ఆమె భారతదేశం తరపున మొదటి కాంటినెంటల్ ఛాంపియన్ గా నిలిచింది. అంతకుముందు భారతదేశం తరపున అనురాధ బిస్వాల్ (2000లో) J. హేమశ్రీ (2013) కాంస్య పతకాలు సాధించారు. 12.84 సెకెండ్లలో ఆమె అనుకున్నది సాధించింది. అయితే ఆమె బెస్ట్ 2022లో 12.82 సెకండ్లుగా ఉంది.
ఆమె తండ్రి, సూర్యనారాయణ, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, ఆమె తల్లి కుమారి, నగరంలోని ఒక ఆసుపత్రిలో పార్ట్‌టైమ్‌గా క్లీనర్‌గా పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిపి నెలకు రూ. 18,000 కంటే తక్కువ సంపాదించేవారు. జ్యోతి వైజాగ్‌లోని పోర్ట్ హైస్కూల్ కృష్ణాలో చదువుకుంది. ఆమె ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఆమెను హర్డిలర్‌గా చేయాలని అనుకున్నారు. అందుకు సంబంధించి ఆమెకు మంచి ఎత్తు ఉండడంతో ఆ వైపుగా జ్యోతి దృష్టి పెట్టింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.
తన తల్లిదండ్రులను బాగా చూసుకోవడమే తాను అథ్లెటిక్స్ లో అడుగుపెట్టడం వెనుక ఉన్న ఉద్దేశ్యమని జ్యోతి తెలిపింది. ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో BA హిస్టరీ చదువుతోంది జ్యోతి యర్రాజి. 2015లో, జ్యోతి యర్రాజీ తొలిసారిగా ఆంధ్ర ప్రదేశ్ అంతర్ జిల్లాల మీట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుని వెలుగులోకి వచ్చింది. మరుసటి సంవత్సరం, ఒలింపియన్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన కోచ్ ఎన్ రమేష్ వద్ద శిక్షణ కోసం ఆమె హైదరాబాద్‌లోని SAI సెంటర్‌కు వెళ్లింది. జూనియర్, సీనియర్ నేషనల్ మీట్‌లలో జ్యోతి స్థిరంగా పతకాలు సాధించింది. హైదరాబాద్‌లోని సాయ్ సెంటర్‌లో రెండేళ్లు చదివిన ఆమెకు గుంటూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరే అవకాశం వచ్చింది. 2019లో, జ్యోతి భువనేశ్వర్‌లోని ఒడిశా రిలయన్స్ అథ్లెటిక్స్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్ లో అవకాశం దక్కించుకుంది. అక్కడ ఆమెపై బ్రిటిష్ కోచ్ జేమ్స్ హిల్లియర్ దృష్టి పెట్టారు.
జేమ్స్ హిల్లియర్ ఆధ్వర్యంలో జ్యోతి యర్రాజీ మంచి పురోగతిని సాధించింది. జనవరి 2020 నాటికి సూపర్ అథ్లెట్ గా ఆమె నిలిచింది. కర్ణాటకలోని మూడబిద్రిలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్శిటీ అథ్లెటిక్స్ మీట్‌లో ఆమె 13.03 సెకన్లతో స్వర్ణం గెలుచుకుంది. ఆమెకు భారతీయ మహిళల 100 మీటర్ల హర్డిల్స్ జాతీయ రికార్డును అందుకుంది. కానీ ఈ ఈవెంట్ లో సాధించిన రికార్డు ఆమె అధికారికంగా ఆ రికార్డును సాధించడానికి సరిపోలేదు. ఈ ఈవెంట్ కు ముందు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) ఆమెను పరీక్షించలేదు. ఈవెంట్‌లో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) నుండి సాంకేతిక ప్రతినిధి ఎవరూ లేరు. ఫిబ్రవరి 2020లో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఆమె మరో స్వర్ణం గెలుచుకుంది.
సంవత్సరం తరువాత, జ్యోతి యర్రాజీ దక్షిణాసియా యూత్ గేమ్స్‌లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేయడానికి సిద్ధమైంది. అయితే COVID-19 మహమ్మారి కారణంగా ఇండోర్ ఏషియాడ్, వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్ వంటి ఈవెంట్‌లు ఆగిపోయాయి. ఆ తర్వాత వెన్ను నొప్పి కారణంగా ఆమె నెలల తరబడి ఈవెంట్ లకు దూరంగా ఉండిపోయింది. ఆ సమయంలో ఆమెలో కాన్ఫిడెన్స్ లోపించడం చూశానని జేమ్స్ హిల్లర్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో అన్నారు. "ఆ సమయంలో ఆమె హర్డిలింగ్ చేయడానికి భయపడింది. మా మొదటి సెషన్‌లో, సింగిల్ హర్డిల్ కు అతి తక్కువ దూరం పెట్టినా కూడా ఆమె దానిని దాటడానికి ఇష్టపడలేదు." అని తెలిపారు. జ్యోతి యర్రాజీ ఆత్మవిశ్వాసం, శారీరక బలాన్ని పునరుద్ధరించడానికి జేమ్స్ హిల్లియర్, అతని బృందం చాలా కృషి చేసింది. ఆమె ఈ ఇబ్బందులు అన్నీ దాటుకుని వచ్చి తిరిగి ట్రాక్ అండ్ ఫీల్డ్ లో సత్తా చాటుతోంది. 2021 లో పూర్తీ సీజన్ ను మిస్ అయిన జ్యోతి.. 2022 లో మళ్లీ రాణించడం మొదలుపెట్టింది. భువనేశ్వర్‌లో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ మీట్‌లో 13.7 సెకన్లతో ప్రారంభించిన జ్యోతి.. తన టైమింగ్ ను మెరుగు పరచుకుని దూసుకుపోతోంది. త్వరలో ఆమె పలు ఈవెంట్లలో సత్తా చాటి ఒలింపిక్స్ కు అర్హత సాధించాలని భావిస్తూ ఉంది.