దక్షిణాఫ్రికా పై భారత్ ఘన విజయం
భారత మెన్స్ జట్టు దక్షిణాఫ్రికాపై విజయంతో సిరీస్ ను మొదలు పెట్టింది. డర్బన్‌లోని కింగ్స్ మీడ్ మైదానంలో మొదట బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరు కనబరిచారు
భారత మెన్స్ జట్టు దక్షిణాఫ్రికాపై విజయంతో సిరీస్ ను మొదలు పెట్టింది. డర్బన్‌లోని కింగ్స్ మీడ్ మైదానంలో మొదట బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరు కనబరిచారు. భారత జట్టు 61 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసింది. భారత్ నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 141 రన్స్‌కే ఆలౌట్ అవ్వడంతో మొదటి టీ20 భారత్ వశమైంది.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ 50 బంతుల్లో 107 పరుగులు చేశాడు. సంజూ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ 33, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు చేశారు. ఆఖర్లో హిట్టర్లు విఫలమవడంతో భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ 3 వికెట్లు తీయగా... మార్కో యన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రూగర్ తలో వికెట్ పడొట్టారు.
లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఏ దశలోనూ టార్గెట్ ను చేరుకునేలా కనిపించలేదు. క్లాసెన్ 25, కోట్జీ 23, ర్యాన్ రికెల్టన్ 21 మాత్రమే రాణించారు. 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా చిక్కుల్లో పడింది. చివరికి 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీశారు. రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.