రేపే మహాజాతర... ఏర్పాట్లు పూర్తి
మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 16వ తేదీ నుంచి 19 వ తేదీ వరకూ జాతర జరగనుంది.
అతిపెద్ద గిరిజన జాతర రేపు ప్రారంభం కానుంది. మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 16వ తేదీ నుంచి 19 వ తేదీ వరకూ జాతర జరగనుంది. ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మక్క, సారలమ్మ లకు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మేడారం జాతర విశిష్టతను గుర్తించి ప్రత్యేక నిధులను కేటాయించింది.
అన్ని రకాలుగా...
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా దీనికి పేరుంది. దక్షిణ కుంభమేళాగా కూడా పిలుస్తారు. దాదాపు కోటిన్నర మంది ఈ జాతరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేశారు. పారిశుద్ధ్య పనులతో పాటు పార్కింగ్ ప్లేస్ లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి వాటిని అధిక సంఖ్యలో ఏర్పాటు చేశారు. 1100 ఎకరాల్లో 34 పార్కింగ్ ప్లేస్ లను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.
అత్యవసర సేవలకుక....
ఇక అత్యవసర సేవలకు, వైద్య సేవలను అందించేందుకు 19 మెడికల్ క్యాంప్ లతో పాటు ప్రత్యేక వైద్య శాలను కూడా ఏర్పాటు చేశారు. పదిహేను అంబులెన్స్ లను సిద్దంగా ఉంచారు. వీటితో పాటు బైక్ అంబులెన్స్ లనుకూడా రెడీ ఉంచారు. ఈ జాతర కోసం 10,300 పోలీసు సిబ్బందిని నియమించారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించేలా పోలీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే మేడారం భక్తులతో కిటకిటలాడుతుంది.