Telangana: తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు అడ్డంకులేంటంటే?
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 3వ తేదీన జరుుతుందని అందరూ భావించారు;

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 3వ తేదీన జరుుతుందని అందరూ భావించారు. ఢిల్లీకి పార్టీ నేతలను పిలపించి హైకమాండ్ నేతలు చర్చించడంతో ఇక మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందరూ అనుకున్నారు. మొత్తం ఖాళీగా ఉన్న ఆరు పోస్టుల్లో నాలుగింటిని ఈ దఫా భర్తీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ మాత్రం జరగలేదు. కారణం మాత్రం అనేక మంది అనేకరకాలుగా చెబుతున్నారు. మంత్రి పదవుల కోసం ఎక్కువ మంది పోటీ పడుతుండటం, మంత్రి వర్గ విస్తరణలో పదవులు దక్కకుంటే అసంతృప్తులు పెరిగే అవకాశముందని భావించి వెనక్కు తగ్గిందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకూ ఇక మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదని పలువురు చెబుతున్నారు.
నమ్మకున్న వాళ్లకు కాకుండా...
పార్టీని నమ్ముకుని ఏళ్లుగా జెండాను పట్టుకున్న నేతలకు కాకుండా పార్టీలు మారి వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో అధినాయకత్వానికి లేఖలు మీద లేఖలు రాస్తున్నారు. జిల్లాల వారీగా, సామాజికవర్గాల వారీగా ప్రాధాన్యత కల్పించాలని లేఖలు రాస్తున్నారు. చివరకు సీనియర్ నేత జానారెడ్డి సయితం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని లేఖ రాయడంతో ఒకింత ఇబ్బందికరంగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఎస్టీ సామాజికవర్గం, మాదిగ సామాజికవర్గం నేతలు కూడా తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ లేఖలు రాశారు.
వారికే మంత్రి పదవులు ఇస్తే...
మరొక వైపు తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే నల్లగొండ జిల్లాకు అత్యధిక పదవులు ఇచ్చినట్లవుతుందని, ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రిపదవులు ఇవ్వడం ఏంటన్న ప్రశ్న ఎదురవుతుంది. మరొకవైపు పార్టీలు మారి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని అంటున్నారు. జీవన్ రెడ్డి, అద్దంకి దయాకర్ లాంటి వాళ్లను కాదని, ధనబలం ఉన్నగడ్డం వివిక్, కోమటిరెడ్డి రాజగోపాల్ కు మంత్రి పదవులు ఇస్తారని జరుగుతున్న ప్రచారంపై కూడా క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుందన్న భావనలో హైకమాండ్ నేతలు ఉన్నట్లు కనపడతుంది. అందుకే కొన్నాళ్లు మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కొందరు చెబుతున్నారు.