ఇటు అభ్యర్థులు - అటు దరఖాస్తులు ! టి కాంగ్రెస్ వెనుకంజ !!

''ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం.ఎన్నికలకు మూడు నెలల ముందే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలి''.

Update: 2023-08-19 09:51 GMT

ఇటు అభ్యర్థులు - అటు దరఖాస్తులు !

టి కాంగ్రెస్ వెనుకంజ !!

SK.ZAKEER

''ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం.ఎన్నికలకు మూడు నెలల ముందే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలి''.2022 జూలైలో మేడ్చల్‌ జిల్లా కీసరలోని చింతన్‌ శిబిర్‌ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.''ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని వారికి పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వాల''ని కూడా పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రెండు రోజుల పాటు అప్పట్లో మేధోమథనం జరిగింది.చింతన్‌ శిబిర్‌ పేరిట ఈ సమావేశం నిర్వహించారు.ఎన్నికలే టార్గెట్‌గా ఆరు కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు.

పలు తీర్మానాలను ఆమోదించారు.అయితే అందులో 'అభ్యర్థుల ఎంపిక,ప్రకటన' కీలకం.డిసెంబర్ లో ఎన్నికలు జరగనుండగా ఆగస్టు చివరి వరకు కూడా అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసుకోలేకపోతోంది.అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మూడు రోజుల కిందట ప్రారంభమైంది.దీన్ని బట్టి కాంగ్రెస్ నాయకత్వం ఎంత మందకొడిగా కార్యకలాపాలు చేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఆగస్టు 18 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది.ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక గతంలో ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా ఉండాలి? కర్ణాటకలో అభ్యర్థుల ఎంపిక ఎలా జరిగింది? ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి? అనే తదితర అంశాలపై సీనియర్ల నుంచి అభిప్రాయాలను స్క్రీనింగ్ కమిటీ అడిగి తెలుసుకున్నది.

ఓసీ అభ్యర్థులైతే రూ. 50 వేలు, బీసీలైతే రూ. 25 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ సూచించింది. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు రుసుము లేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంతమంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిసింది.ముందుగా దరఖాస్తులను పరిశీలించి టికెట్లను కేటాయిస్తారని తెలుస్తోంది. దరఖాస్తులు చేసుకున్నవారు పార్టీకి నిధులు ఇచ్చినట్లే అవుతుంది.తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి దాదాపు ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఎక్కువగానే ఈ సంఖ్య ఉంది. ఈ నేపథ్యంలో పార్టీకి నిధులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్నది.దరఖాస్తులు భారీగా వస్తే ఎంపిక ఎలా ఉంటుందనేదానిపైన ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు సమర్పించిన దరఖాస్తులను టీపీసీసీ నాయకత్వం,పార్టీ హైకమాండ్ నియమించిన స్క్రీనింగ్ కమిటీ ఎప్పుడు పరిశీలిస్తుందో... ఎప్పుడు ప్రాధమిక నివేదికను తయారు చేస్తారో తెలియదు.మరోవైపు శాసనసభ ఎన్నికల వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు.ఈ నెల 21వతేదీన బిఅర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నవి. సిఎం కేసిఅర్ మీడియా సమావేశంలో జాబితాను ప్రకటించనున్నారు.

కాగా ఏడెనమిది చోట్ల తప్ప సిట్టింగుల స్థానాల్లో పెద్దగ మార్పులు ఉండే అవకాశం లేదని బిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు ఉండదని ఆయా వర్గాలంటున్నవి.

కేసీఆర్ జిల్లాల పర్యటనలు విస్తృతంగా జరప తలపెట్టారు.ఎన్నికల ప్రచారానికి ఎక్కడి నుంచి శ్రీకారం చుట్టాలన్న అంశంపై చర్చలు జరుగుతున్నవి.దాదాపు వరంగల్ నుంచే మొదటి ప్రచార సభ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.కాంగ్రెస్,బీజేపీ బలాలు,బలహీనతలపై కేసీఆర్ కు సమగ్ర అవగాహన ఉన్నది.ప్రత్యర్థుల బలహీనతలను సొమ్ము చేసుకోవడం ఆయనకు ఎడమ చేతి పని.డబ్బు పదవులు ఆశ జూపి ఎవరినైనా సులభంగా తమ వైపునకు లాగిపారేయవచ్చునని బిఆర్ఎస్ సారధి నమ్మకం.ఇలాంటి వ్యవహారాల్లో కేటీఆర్,హరీశ్ రావు ముఖ్యమంత్రికి తోడూ నీడగా ఉన్నారు.కేసీఆర్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రంగంలోకి దూకి 'ఆపరేషన్ 'పూర్తి చేయడంలో ఈ ఇద్దరు మంత్రులూ ఆరితేరారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనుకూల,వ్యతిరేక శిబిరాలుగా చీలిపోయి ఉన్నది.కొందరు సీనియర్ నాయకులే రేవంత్ వ్యవహార శైలి నచ్చకపోవడంతో బిఆర్ఎస్ వైపు చూస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నవి.

(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)

Tags:    

Similar News