తెలంగాణయే నెంబర్ వన్ : కేసీఆర్

తెలంగాణ చరిత్రలో సెప్టంబరు17కు ఒక ప్రత్యేక చరిత్ర ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Update: 2023-09-17 06:09 GMT

తెలంగాణ చరిత్రలో సెప్టంబరు17కు ఒక ప్రత్యేక చరిత్ర ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రాచరికం ముగిసి ప్రజాస్వామ్య పాలన మొదలయిందన్నారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఆయన జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ సాధనతోనే తన జన్మ సాకారమైందన్నారు. న్యాయం, ధర్మం కోసం ఎందరో ప్రాణత్యాగాలు నాడు చేశారన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్ వల్లనే ప్రస్తుత భారతదేశం ఏర్పాటయిందని కేసీఆర్ తెలిపారు. 1956లో తెలంగాణ ప్రజల ఆలోచనకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారన్నారు.

సాగునీటిని...
తెలంగాణ రాష్ట్రం సాకారమయిన తర్వాత ఎన్నో ఘనతలను సాధించుకున్నామన్నారు. మన కలలను సాకారం చేసుకోగలిగామన్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణా నీటిని తెచ్చి కరువు ప్రాంతానికి నీరు అందించామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వలస వచ్చే పరిస్థితికి తీసుకు వచ్చామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో త్వరలోనే సాగు, తాగునీరు అందించబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రానున్న మూడున్నరేళ్లలో కోటిన్నర ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
అన్ని రంగాల్లో...
వైద్య విద్యలో నూతన విప్లవాన్ని తీసుకు వచ్చామన్నారు. వైద్య సీట్లను గణనీయంగా పెంచుకున్నామని తెలిపారు. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలందించడంలో దేశంలోనే తెలంగాణలో మూడో స్థానంలో ఉందని నీతి అయోగ్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలను అందిస్తామని చెప్పారు. బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసుకుని పేదలకు మెరుగైన ఉచిత వైద్య సేవలందిస్తున్నామని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పారదర్శకంగా లాటరీ పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ఈ పథకం నిరంతరం కొనసాగుతుందని కేసీఆర్ తెలిపారు.
పెట్టుబడులు...
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. నిరంతర విద్యుత్తును అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు 67 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, ఇప్పటికే 27 ఫ్లై ఓవర్‌లను పూర్తి చేశామని తెలిపారు. నూతన సచివాలయాన్ని, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో హైదరాబాద్‌కు మరింత శోభ కలిగిందన్నారు. విశ్వనగరంగా మరింత అభివృద్ధి చెందనుందని ఆయన తెలిపారు. మిషన్ కాకతీయ, భగీరధల ద్వారా తాగునీటి రంగాన్ని విస్తృత పర్చామని తెలిపారు. సంక్షేమ చర్యలతో రైతన్నలకు ఊరట కల్గించామని తెలిపారు. 44 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులకు నిరంతరం ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలో నెంబరు వన్ అని ఆయన తెలిపారు. బంగారు సాధన దిశగా మరింతగా ప్రయత్నిస్తామని తెలిపారు.


Tags:    

Similar News