BJP : ఒకరు సాఫ్ట్.. మరొకరు ఫాస్ట్.. ఎవరికి పగ్గాలిస్తే బాగుంటుందో మరి?
తెలంగాణలో బీజేపీ గతంలో కన్నా బలంగా తయారైంది. అందుకు శాసనసభ, పార్లమెంటు ఎన్నికలలో వచ్చిన ఫలితాలే ఉదాహరణ
తెలంగాణలో బీజేపీ గతంలో కన్నా బలంగా తయారైంది. అందుకు శాసనసభ, పార్లమెంటు ఎన్నికలలో వచ్చిన ఫలితాలే ఉదాహరణ అని చెప్పాలి. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. దక్షిణ భారత దేశంలో ఎప్పటికైనా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కేంద్ర నాయకత్వంలో బలంగా ఏర్పడింది. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మిగిలిన సమయాల్లోనూ ఈ ప్రాంత పార్టీపై ఢిల్లీ పెద్దలు ఫోకస్ పెడుతుంటారు. దక్షిణ భారత దేశంలో అత్యధికంగా సీట్లు సాధించే రాష్ట్రంగా తెలంగాణ బీజేపీ ఖాతాలో చేరిపోయిందనే చెప్పాలి. మరే రాష్ట్రం సౌత్ ఇండియాలో ఇలాంటి సానుకూల వాతావరణం పార్టీకి లేదు.
ఫలితాలు అనుకూలంగా..
గత అసెంబ్లీ ఎన్నికలు 2023 జరిగాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మునుపెన్నడూ ఇంతటి స్కోరు లేదు. ఓటింగ్ శాతం కూడా బాగా పెరిగింది. అన్ని జిల్లాల్లో పార్టీ బలోపేతం అయిందని ఈ ఫలితాలను బట్టి చెప్పవచ్చు. దీంతో నాయకత్వం మరింత బలపడే అవకాశముంది. క్యాడర్ కూడా ఉత్సాహంగా ఉంది. ఆ తర్వాత 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ సేమ్ డిజిట్ తో స్థానాలను గెలుచుకుంది. క్లిష్టపరిస్థితుల్లో ఎనిమిది పార్లమెంటు స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. అందుకే కేంద్ర మంత్రి వర్గంలో ఇద్దరికి స్థానం కల్పించారు. రెండు మంత్రి పదవులు తెలంగాణకు ఇవ్వడం వెనక కూడా ఇక్కడ పార్టీ బలోపేతం అవుతుందనే.
కిషన్ రెడ్డి సాఫ్ట్ కార్నర్ తో...
అయితే ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. ఇటు బీజేపీ రధ సారధిగా రాష్ట్రానికి వ్యవహరిస్తున్నారు. కానీ కిషన్ రెడ్డి కొంత సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరిస్తారు. విమర్శలు చేసినా సరే.. ఆందోళనలకు దిగినా సరే తన పరిధిని దాటి వ్యవహరించరు. హైడ్రా కూల్చివేతలను, మూసీనది ప్రాజెక్టు సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించినా ఆయన ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనరు. ఆయనకంటూ ఒక పరిధిని సృష్టించుకున్నారు. కొంత క్లాస్ గా వ్యవహరిస్తారు. మీడియా ముందు విమర్శలకు, ఇతర ఆరోపణలు చేసి ఆయన పరిమితమవుతారు తప్పించి రోడ్డెక్కి ఆందోళన చేయరు. ఇందిరా పార్కు వద్ద ధర్నా వంటి కార్యక్రమాలకే వస్తారు.
మాస్ క్యారెక్టర్ తో సంజయ్...
ఇక బండి సంజయ్ ఉన్నారు. ఆయనది మ.. మ.. మాస్. మాస్ లీడర్‌లా వ్యవహరిస్తారు. ఒక్కోసారి తాను కేంద్ర మంత్రిని అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వ్యవహరిస్తారు. గ్రూప్ వన్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించడంలో తప్పేమీ లేదు. కానీ కేంద్ర మంత్రిగా బండి సంజయ్ చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో నేరుగా పాల్గొని అరెస్ట్ కావడమే చర్చనీయాంశమైంది. అయితే బండి సంజయ్ లాంటి వాళ్లే పార్టీకి అవసరం అన్నది క్యాడర్ భావన. ఆ దూకుడు లేకపోతే... ఇటు కేసీఆర్ కుటుంబాన్ని, అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తట్టుకోలేమని అంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలా తెలంగాణ బీజేపీలో ఒక నేత కిషన్ రెడ్డిది సాఫ్ట్ కార్నర్ అయితే బండి సంజయ్‌ది మాస్ క్యారెక్టర్.