Telangana : జనవరి 29న ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ షెడ్యూల్ విడదలయింది. బీఆర్ఎస్ నుంచి హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యేలగా ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎన్నికయ్యారు. దీంతో వీరిద్దరూ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ షెడ్యూల్ విడుదలయింది.
కౌంటింగ్ ఎప్పుడంటే...?
ఈ రెండు స్థానాలకు సంబంధించి ఈరోజు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 11 తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జనవరి 29న పోలింగ్ జరగనుంది. అలాగే జనవరి 18వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. జనవరి 19న నామినేషన్లను పరిశీలిస్తారు. జనవరి 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. అయితే రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ పోటీకి దింపుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.