Union Budget : తెలంగాణకు బడ్జెట్ లో నిధులు నిల్... ఈ వివక్ష ఏల నిర్మలమ్మా?
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది. నిధులు కేటాయించలేదు;

కేంద్ర ప్రభుత్వానికి అవసరం.. ఎన్నికలు.. ఈ రెండు మాత్రమే బడ్జెట్ లో కనిపిస్తున్నాయి. పన్నులు కట్టే ప్రజలు పట్టరు. అందుకు ఉదాహరణ తెలంగాణ అని చెప్పాలి. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది. నిన్న నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ లో ఎన్నికలు జరిగే బీహార్ కు భారీగా నిధులను ప్రకటించింది. అదే సమయంలో ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి ఆసరా ఉండే ఆంధ్రప్రదేశ్ కు కూడా పరవాలేదని పించింది. కానీ ఏ నిధులు ఇవ్వనిది తెలంగాణకు మాత్రమే. తెలంగాణ ప్రజలు దేశంలో ప్రజలు కారా? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంతటి వివక్ష దేనికని వారంటున్నారు. నిజానికి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పన్నును కేంద్రానికి చెల్లించేది తెలంగాణ మాత్రమేనని గుర్తు చేస్తున్నారు.
తెలంగాణ ఊసే లేకపోవడంతో...
అసలు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో నిర్మలమ్మకు తెలంగాణ అనేది ఒకటి ఉందన్న స్పృహ ఏమైనా ఉందా? అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క పథకానికి కాని, ప్రాజెక్టుకు కానీ బడ్జెట్ లో చోటు దక్కకపోవడం నిజంగా ఏకపక్ష వైఖరి అని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రతిదపానలలు పంపినా కేంద్రం వాటి వైపు కూడా చూడలేదు. అసలు నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో తెలంగాణ పదం అని ఉచ్ఛరించకపోవడం కూడా ఈ రాష్ట్రపై ఎంత సవతి తల్లి ప్రేమ చూపిస్తుందో అర్థమవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలు కాదు కానీ, నిజానికి తెలంగాణకు దక్కాల్సిన న్యాయపరమైన నిధులను కూడా ఇవ్వకపోవడం మాత్రం విచారకరమని పలువురు మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఇద్దరు కేంద్ర మంత్రులున్నా...
బయ్యారం ఉక్కు కర్మాగారం ప్రస్తావన లేదు. ఐఐఎం పేరు కూడా ఎత్తలేదు. అలాగే హైదరాబాద్ నగరంలో అనేక ప్రతిపాదనలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో చోటు కల్పించలేదు. మెట్రో రైలు విస్తరణకు కూడా నిధులు కేటాయించలేదు. పెరుగుతున్న నగరంతో పాటు పలు అవసరాలు కూడా ఉండటంతో అవసరమైన సదుపాయాల కల్పనకు కేంద్ర సహాయ సహకారాలు అవసరం. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందునే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి అవసరమైన నిధులను తేవడంలో విఫలమయ్యారన్న విమర్శలను ఇద్దరూ ఎదుర్కొంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇది తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీహార్, ఏపీలకు నిధులు కేటాయించి, ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేయడం ఏమిటన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.