Telangana : శంషాబాద్ లో మరోసారి చిరుతపులి కలకలం.. అది చిరుతేనా?
శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు
శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఒక దూడపై చిరుతపులి దాడి చేసినట్లు చెబుతున్నారు. దూడకు అయిన గాయాలను కూడా చూసిన అటవీ శాఖ అధికారులు చిరుత పనేనా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. శంషాబాద్ మండలం ఘన్సీమియాగూడ పొలాల్లో చిరుత పులి సంచారం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
స్థానికుల ఆందోళనతో...
అక్కడ సమీపంలోని చెరువులో చిరుత పులి నీరు తాగినట్లు ఆనవాళ్లను గుర్తించారని, అయినా అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం అది చిరుతా? లేక మరేదైనా జంతువా? అన్నది మాత్రం నిర్ధారించలేకపోతున్నారు. ఖచ్చితంగా చిరుతపులి అని నిర్ధారించలేకపోతున్నారు. అయితే స్థానికులు భయాందోళనలకు గురి అవుతుండటంతో చిరుత సంచారాన్ని కనుగొనేందుకు ట్రాప్ కెమెరాలను, దానిని బంధించడానికి బోన్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.