SLBC Accident : తవ్వకాలు జరపాలంటే అదే భయం..మరో ప్రమాదం జరగకుండా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి;

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 39వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్ చేరుతుంది. అయినా మృతదేహాల జాడ దొరకడం లేదు. టన్నెల్ లో నిర్విరామంగా మృతదేహాలున్న ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడ మినీ జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు. ఇప్పటి వరకూ తప్పిపోయిన ఎనిమిది మందిలో రెండు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మరో ఆరు మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక అధికారి శివశంకర్ నేతృత్వంలో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి.
అనేక ఆటంకాలు...
అయితే సొరంగ మార్గంలో అనేక ఆటంకాలు తవ్వకాలకు ఇబ్బందికరంగా మారాయి. టన్నెల్ లో మరో నాలుగు షీర్ జోన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. షీర్ జోన్లు అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. మొత్తం టన్నెల్ లో పదకొండు వరకూ షీర్ జోన్లు ఉంటే.. అందులో ఆరు జోన్లు దాటి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన చోట ఉన్న నాలుగు జోన్లు అత్యంత ప్రమాదకరమైనవని భావిస్తుండటంతో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. మరో ప్రమాదానికి తావివ్వకుండా ఆలోచించి, అందరూ సమిష్టిగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోనున్నారు.
నీరు ఉబికి వస్తుండటంతో...
షీర్ జోన్ల నుంచి నీరు ఉబికి వస్తుండటంతోనే ప్రమాదకరమని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఏ మాత్రం తవ్వకాలు జరిపినా పై కప్పు కూలిపోయే అవకాశముందని భావించి అక్కడ జాగ్రత్తగా గాలింపు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మృతదేహాలను వెలికితీయడంలో ఆలస్యమవుతుంది. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నా అజాగ్రత్తగా ఏ మాత్రం ఉన్నా మరో ప్రమాదం జరిగే అవకాశముందన్నహెచ్చరికలతో కొంత ఇబ్బందిగా మారుతుంది. పూర్తిగా అధ్యయనం చేసిన అనంతరం, ప్రమాదం లేని పరిస్థితుల్లోనే తవ్వకాలు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో మరి కొంత కాలం మృతదేహాలు లభ్యమయ్యేందుకు సమయం పట్టే అవకాశముంది.