నీట మునిగి గూగుల్ ఉద్యోగుల మృతి.. మద్యం మత్తులోనా..?
సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొండపోచమ్మ సాగర్ జలాశయంలో ఈతకు వెళ్లి హైదరాబాద్ బాచుపల్లికి చెందిన అక్షయ్ వెంకట్(28)
సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొండపోచమ్మ సాగర్ జలాశయంలో ఈతకు వెళ్లి హైదరాబాద్ బాచుపల్లికి చెందిన అక్షయ్ వెంకట్(28), బోయినపల్లికి చెందిన రాజన్ శర్మ(28) మృతి చెందారు. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతానికి చెందిన వడ్లమూలి అక్షయ వెంకట్, సికింద్రాబాద్ బోయినపల్లిలోని మల్లికార్జున కాలనీకి చెందిన రాజన్‌శర్మ లు గూగుల్ సంస్థలో ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఆదివారం వీరిద్దరు రాంకోటికి చెందిన మరో మిత్రుడు రిషబ్‌షాతో కలిసి కారులో సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల పరిధిలోని కొండపోచమ్మ జలాశయానికి వచ్చారు. ఉదయం 6 గంటలకు ఈత కొడదామని అక్షయ వెంకట్, రాజన్‌శర్మలు జలాశయంలోకి దిగారు. వారికి ఈత రాకపోవడంతో నీటమునిగి చనిపోయారు. ఒడ్డున ఉన్న రిషబ్‌షా మిత్రులిద్దరూ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమందించారు. వారు గాలింపు చర్యలు చేపట్టగా మధ్యాహ్నం మృతదేహాలు లభించాయి. ఘటనాస్థలంలో మద్యం సీసాలు ఉండడంతో మృతులు తాగి మత్తులో ఈత కొట్టేందుకు వెళ్లి ఉంటారని ములుగు ఎస్సై రంగ కృష్ణగౌడ్ తెలిపారు.