Summer Effect : మాడు పగులుతోంది.. మధ్యాహ్నం అయితే చాలు... నిప్పుల వర్షమే

ఎండలు ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ముదిరిపోయాయి. అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

Update: 2024-04-03 02:56 GMT

ఎండలు ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ముదిరిపోయాయి. అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా మే చివరి వారంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు అదరగొడుతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు రావాలంటే భయపడిపోతున్నారు జనం. నిన్న అత్యధికంగా నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఆరెంజ్ అలెర్ట్...
దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటేశాయి. దీంతో పాటు వడగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు వినియోగం కూడా ఎక్కువయింది. చిరు వ్యాపారులు, రైతులు, కూలీల సంగతి చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు ఉపాధి కోసం ఎండలోనే అలమటించిపోతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లయింది.
వాహనాలకు ప్రమాదం...
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. రోడ్డు మీద వాహనాలు కూడా వెళుతుంటే ఆవిర్లు కనిపిస్తున్నాయి. ఈ ఎండల్లో సొంత వాహనాల్లో ప్రయాణం మానుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ప్రమాదానికి గురయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు చెుతున్నారు. సాయంత్రం ఐదున్నర గంటల వరకూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Tags:    

Similar News