"వరద"లోనూ ఎవరికి వారే
వరదల్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై విడివిడిగా పర్యటించారు.
వరదల్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై విడివిడిగా పర్యటించారు. ఒకే జిల్లాలో పర్యటన చేసినా ఇద్దరూ వేర్వేరు కార్యక్రమాలను చేపట్టారు. ఇది రాజకీయంగా మరోమారు చర్చనీయాంశమైంది. గోదావరి వరద దెబ్బకు భద్రాచలం - కొత్తగూడెం ప్రాంతం బాగా దెబ్బతినింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. గవర్నర్ పర్యటనకు జిల్లా కలెక్టర్, ఎస్పీ దూరంగా ఉన్నారు. ఆర్డీవో వరద నష్టాన్ని గురించి తమిళిసైకి వివరించారు.
ఒకే జిల్లాలో....
మరోవైపు కేసీఆర్ కూడా భద్రాచలం వచ్చారు. పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులను పరామర్శించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద పదివేల రూపాయలు ప్రకటించారు. శాశ్వతంగా కాలనీలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భద్రాచలంలో అధికారులతో సమీక్ష చేసిన అనంతరం కేసీఆర్ హెలికాప్టర్ లో ఏటూరు నాగారం బయలుదేరి వెళ్లారు. గవర్నర్ మాత్రం తాను ఎవరికో పోటీగా ఇక్కడకు రాలేదని, బాధితులను పరామర్శించడానికే వచ్చానని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు.