Telangana : కాంగ్రెస్ లో గాలి వాటం లీడర్లే ఎక్కువ.. అధికారంలో వస్తే చాలు చెలరేగిపోతారంతే
అధికారంలో లేనప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఎటువంటి ప్రయత్నం చేయరు.;

అధికారంలో లేనప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఎటువంటి ప్రయత్నం చేయరు. అంతెందుకు తమకు తాము గెలిచేందుకు కూడా వారి సామాజికవర్గంతో పాటు చేసిన పనులు కూడా సహకరించవు. కానీ పార్టీ అధికారంలోకి రాగానే తమకు మంత్రి పదవులు కావాలంటూ గొంతు చించుకుంటారు. అది కాంగ్రెస్ లోనే సాధ్యం. పదేళ్ల పాటు గెలుపునకు దూరంగా ఉన్న నేతలు ఇప్పుడు అధికారంలోకి రాగానే తాము ఇరగదీసే నేతలమంటూ, తమకు అన్యాయం చేస్తున్నారంటూ సొంత పార్టీపైనే విమర్శలకు దిగడం విడ్డూరమన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అధికారంలోకి తీసుకు వచ్చేందుకు మీరు ఏం చేశారన్న ప్రశ్నకు మాత్రం వారి వద్ద సమాధానం ఉండదు.
అంజనీ కుమార్ యాదవ్ అయితే...
2004, 2009 ఎన్నికల్లో వరసగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిచిన అంజనీకుమార్ యాదవ్ ఇప్పడు సొంత పార్టీ పై విమర్శలకు దిగడం పై సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. 2014 నుంచి మళ్లీ ఆయన గెలవలేదు. అప్పుడు కాంగ్రెస్ గాలివాటంలో గెలిచిన అంజనీకుమార్ యాదవ్ కాంగ్రెస్ 2023 లో అధికారంలోకి రాగానే ఆయన కుమారుడికి రాజ్యసభ పదవిని ఇప్పించుకున్నారు. ఇప్పుడు ఆయనలో మళ్లీ అసంతృప్తి తలెత్తింది. అందుకు కారణం తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదనే. ఒకే ఇంట్లో ఇంతమందికి పదవులు ఇచ్చుకుంటూ పోతే ఎలా అని కాంగ్రెస్ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. అంత ఓటు బ్యాంకు ఉన్న నేత అయితే 2023 ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఒక్క సీటును కూడా ఎందుకు కాంగ్రెస్ కు తెచ్చి పెట్టలేకపోయారని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.
చిన్నా రెడ్డి కూడా...
వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కూడా అంతే. ఆయన 2014లో వనపర్తి నుంచి గెలిచారు. తర్వాత ఆయన ఇక గెలవలేదు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే ఆయన విమర్శలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డి పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. చిన్నారెడ్డి సీనియర్ లీడర్. అయితే ఆయన పార్టీలో చర్చించాల్సిన అంశాలు మీడియా సమావేశం పెట్టి మరీ సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడాన్నిపలువురు తప్పుపడుతున్నారు. కేవలం పదవుల కోసమే పార్టీ నాయకత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశ్యంతో ఈ సీనియర్లు ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కావడంతో వీరు ఎన్ని మాటలు మాట్లాడినా వీరిపై చర్యలు ఉండవు. ప్రజలు తిరస్కరించిన నేతలు తమకు దొడ్డిదారిన పదవులు కావాలంటూ పార్టీ నాయకత్వాన్ని బెదిరించడంతో పాటు పార్టీ ప్రతిష్టను దిగజార్చడం ఎంత వరకూ సబబని పలువరు కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.