వైఎస్ భాస్కరరెడ్డికి అస్వస్థత
వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు హాజరు కావలసిన అవినాశ్ రెడ్డి తల్లి అనారోగ్యం సాకుగా చూపించి విచారణకు రావట్లేదని..
మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి ఆయనకు బీపీ పెరగడంతో జైలు సిబ్బంది వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం తిరిగి చంచల్ గూడ జైలుకు తీసుకెళ్లారు. కాగా.. వివేకా హత్యకేసులో అవినాశ్ రెడ్డి ముందుగా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు హాజరు కావలసిన అవినాశ్ రెడ్డి తల్లి అనారోగ్యం సాకుగా చూపించి విచారణకు రావట్లేదని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. అలాగే అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని, అతడిని అరెస్ట్ చేసి విచారించాల్సిన అవసరం ఉందని తన వాదనలు వినిపించింది. కాగా.. ఈ రోజు వరకూ వైఎస్ అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి కర్నూలు విశ్వభారతిలో చికిత్స పొందారు. అక్కడ డిశ్చార్జ్ అయి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. AIG హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో శ్రీలక్ష్మికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.