రేపు గజ్వేల్‌కు ష‌ర్మిల

రేపు గజ్వేల్ నియోజకవర్గంలో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించ‌నున్నారు.

Update: 2023-08-17 15:03 GMT

రేపు గజ్వేల్ నియోజకవర్గంలో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించ‌నున్నారు. దళితబందు పథకంలో అక్రమాలపై ప్రశ్నించాలని స్థానికుల నుంచి ఆహ్వానం రావ‌డంతో ఆమె గజ్వేల్ వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామ వాసులు షర్మిలకి వినతిపత్రం పంపించారు. ఇటీవల తీగుల్ గ్రామంలో సీఎం దిష్టిబొమ్మ దగ్దం చేసి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. పథకంలో అక్రమాలు జరిగాయని.. అర్హులకు దక్కడం లేదని జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలనుంచి వచ్చిన వినతి మేరకు షర్మిల రేపు ఉదయం 10 గంటలకు తీగుల్ గ్రామానికి వెళ్లనున్నారు.

అయితే షర్మిల పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు బహిరంగ ప్రకటనలు చేశారు. బీఆర్ఎస్ నేత‌ల‌ హెచ్చరికల నేపథ్యంలో భద్రత కల్పించాలని షర్మిల పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేసింది. సీఎం ఇలాకాలో జరిగిన అక్రమాలు భయటపడతాయని బీఆర్ఎస్ కి భయం పట్టుకుందని షర్మిల వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గంలో ఓడిపోతామనే కేసీఆర్ తన పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. హెచ్చరికలు పంపినా, పర్యటనను అడ్డుకోవాలని చూసినా నా పోరాటం ఆగదని.. దళితబందు పథకంలో తీగుల్ గ్రామ ప్రజలకు జరిగిన అన్యాయం తెలుసుకోవడం నా భాద్యత అని ష‌ర్మిల పేర్కొన్నారు.


Tags:    

Similar News