‘చిరు’ టార్గెట్‌ని ‘అల్లు’ కొట్టాడు..!

పుష్సలో తగ్గేదేలే అంటూ అలరించిన అల్లు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఏకంగా ఉత్తమ నటుడు అవార్డును ఎగరేసుకుపోయాడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ వరకూ ఇది గొప్ప విషయమే. జాతీయ స్థాయి అవార్డుల్లో మన మెరుపులు తక్కువే.

Update: 2023-08-24 15:28 GMT

 పుష్సలో తగ్గేదేలే అంటూ అలరించిన అల్లు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఏకంగా ఉత్తమ నటుడు అవార్డును ఎగరేసుకుపోయాడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ వరకూ ఇది గొప్ప విషయమే. జాతీయ స్థాయి అవార్డుల్లో మన మెరుపులు తక్కువే. ఓ దశాబ్దానికి ఒకటీ అరా అవార్డులు తప్ప మనం జబ్బలు చరుచుకునేంతలా మన పెర్ఫార్మెన్స్‌ లేదు. పరభాషా నటులు ఆ అవార్డుల్ని తన్నుకుపోతుంటే మనం కళ్లప్పగించి చూడటం తప్ప చేసిందేమీ లేదు. ప్రతీ ఏడాది ఠంచనుగా ఉత్తమ తెలుగు చిత్రం అవార్డుని సాధించడం, దానికే సంబరపడిపోవడం మనకు రివాజు.

ఇక ఉత్తమ నటుడు అవార్డు అనేది తెలుగు నటుడికి రావడం ఇదే మొదటిసారి. జాతీయ అవార్డుని ఒకటి కంటే ఎక్కువ సార్లు తీసుకున్న నటులు కూడా ఉన్నారు. హిందీ చిత్ర సీమను మినహాయిస్తే, మళయాళం నటులు జాతీయ అవార్డులను అందుకోవడంలో ముందుంటారు. ఆ సినిమాల స్థాయి కూడా అలానే ఉంటుంది. అందుకే ఇప్పటివరకూ వచ్చిన జాతీయ అవార్డుల్లో హిందీ సినిమాలకు 25 అవార్డులు వస్తే మళయాళ సినిమాల 14 వరించాయి. ఇక అత్యధికంగా అమితాబ్‌ బచ్చన్‌ ఉత్తమ నటుడిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు, ఆ తర్వాత స్థానంలో కమల్‌ హాసన్‌, మమ్ముట్టి, అజయ్‌ దేవ్‌గన్‌లు ఉన్నారు. వీళ్లు ఇప్పటికి మూడేసి సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. రెండు సార్లు అవార్డు అందుకున్న నటుల్లో దక్షిణాది నుంచి మోహన్‌లాల్‌, ధనుష్‌లు ఉన్నారు.

అప్పట్లో బడిపంతులు సినిమాకు ఎన్టీరామారావుకి జాతీయ అవార్డు వస్తుందనుకున్నారు. కానీ తృటిలో తప్పిపోయింది. బడ్జెట్‌, నటీనటుల పారితోషకాలు, భారీతనం, విఎఫ్‌ఎక్స్‌లను పరిగణనలోకి తీసుకుంటే మన సినిమాలు హిందీకి ఏ మాత్రం తీసిపోవు. కానీ కంటెంట్‌, నేచురాలిటీ, నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ పరంగా తెలుగు సినిమాలు అంత క్వాలిటీగా ఉండవు. ఈ విషయం ఏ మళయాళీ సినిమాను చూసినా తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఓ తెలుగు నటుడు జాతీయ స్థాయిలో నిలబడటం మన పరిశ్రమకు గర్వకారణం. పుష్పరాజ్‌ పాత్రలో మనసు పెట్టి నటించాడు కాబట్టి ఉత్తమ నటుడు అవార్డు ఏరికోరి వరించింది. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో భారీ కమర్షియల్‌ విజయం అందుకోవడం మరో విశేషం. సాధారణంగా క్లాసిక్స్‌లో నటించిన వాళ్లనే జాతీయ అవార్డులు వరిస్తాయి. కానీ ఓ ఫక్తు కమర్షియల్‌ సినిమాలో, ఓ యాంటీ సోషల్‌ ఎలిమెంట్‌గా నటించి అవార్డు పొందడం ‘పుష్పరాజ్‌’కే సొంతం. ఈ అవార్డుకి అల్లు అర్జున్‌ నూటికి నూరు శాతం అర్హుడు. తన లాంగ్వేజీని, బాడీ లాంగ్వేజీని మార్చాడు. కుడి భుజం ఎప్పుడూ ఎత్తి ఉంచే నటించాడు. దానివల్ల తీవ్రమైన నొప్పి ఉండేది. భరించాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. జాతీయ అవార్డుని ఎగరేసుకు పోయాడు.



మెగాస్టార్‌ చిరంజీవికి కూడా జాతీయ అవార్డు మీద మోజు ఉండేది. కానీ కమర్షియల్‌ చిత్రాల ఒరవడిలో కొట్టుకుపోయి, ఆయనలోని నటుడిని చేజేతులా చంపేసుకున్నారు. ఘరానామొగుడు లాంటి సూపర్‌ హిట్‌తో ‘బిగ్గర్‌ దేన్‌ బచ్చన్‌’ అనిపించుకున్న చిరంజీవి వెంటనే జాతీయ అవార్డు కొట్టేయాలనుకున్నారు. కళాతపస్వి కె.విశ్వనాధ్‌ని కలిసి ‘జాతీయ’ స్థాయి సినిమా చేయమన్నారు. ఆ ఫలితమే ఆపద్బాంధవుడు. ఆ సినిమా ప్రేక్షకుల ఆదరణ పెద్దగా పొందలేకపోయింది. కాకపోతే ఆ ఏడాది ఉత్తమ నటుడిగా నంది అవార్డు చిరంజీవిని వరించింది. ఆ తర్వాత హిట్లు, ఫ్లాప్లు ఒడిదుడుకుల్లో చిరంజీవి మరి ప్రయోగాల జోలికి పోలేదు. జాతీయ అవార్డు మెగాస్టార్‌కి కలగానే మిగిలిపోయింది. నాటి మామ కలను నేడు ‘అల్లు’డు తీర్చాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందని ద్రాక్షగానే మిగిలిపోయిన తెలుగు చిత్రసీమ కరువు తీర్చాడు. ఎంతైనా పుష్పరాజ్‌ కదా. తగ్గేదేలే!

Tags:    

Similar News