పొన్నగంటి ఆకు కూరతో ఎంతో మేలు.. ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలిస్తే?
ఆకు కూరలు దివ్య ఔషధంగా చెబుతారు ఆయుర్వేద వైద్యులు.పొన్నగంటి ఆకుకూర ఎంతో ప్రయోజనకరమని వైద్యులు చెబుతున్నారు;

ఆకు కూరలు దివ్య ఔషధంగా చెబుతారు ఆయుర్వేద వైద్యులు. ఆకు కూరల వల్ల ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేకూరుతుందని ఎవరైనా చెబుతారు. విటమిన్లు పుష్కలంగా ఉండటమే కాకుండా వివిధ రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతారు. ఆకుకూరలు వారానికి కనీసం నాలుగు రోజులు తింటే మంచిదని కూడా వైద్యులు చెబుతారు. ప్రతి ఆకుకూరలో ఏదో రకమైన ఆరోగ్య ఔషధాలున్నాయంటారు. అలాగే విటమిన్లు కూడా శరీరానికి లభించి మనం ఉత్సాహంగా ఉండేందుకు దోహదపడతాయంటారు.
కంటి సంబంధిత...
ఒక పొన్నగంటి ఆకుకూర ఎంతో ప్రయోజనకరమని వైద్యులు చెబుతున్నారు. ఇది నేత్రవ్యాధులు కలవారికి చాలా అద్బుతంగా పనిచేస్తోందని తెలిపారు. ఇది మలాన్ని గట్టిపరుస్తుంది. శరీరాన్ని శీతలంగా ఉంచుతుందని కూడా ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పొన్నగంటి ఆకు కూరతో ఈ రకమైన ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. రక్తదోషం , కఫం , వంటి సమస్యలు ఉన్నవారు పొన్నగంటి ఆకు కూరను తీసుకోవడం చాలా మంచిది. జ్వరం , శరీరంలో వాపు , దురద , స్ప్లీన్ సమస్య , వాతం , వాంతి , అరుచి వీనిని పోగొడుతుందని తెలిపారు.
అనేక రకాలుగా...
పొన్నగంటి ఆకు కూర గుండెకు మేలు చేస్తుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులున్న వారు ఈ ఆకుకూరను తరచూ తీసుకోవడం మేలని సూచిస్తున్నారు. ఇది శరీరానికి చలువచేయడమే కాకుండా జ్వరతాపాలను , అతిదాహం కూడా తగ్గిస్తుందన్నది వైద్య నిపుణుల అభిప్రాయం. ఆవునెయ్యితో ఉడికించి పొన్నగంటి ఆకుని కండ్లకు కడితే వేడివల్ల కలిగే నేత్రవ్యాధులు నయం అవుతాయని చెబుతారు. మూలవ్యాధుల్లో కూడా పొన్నగంటికూర చాలా బాగా పనిచేస్తుందని, వేడివలన వచ్చే తలపోట్లలో పొన్నగంటి ఆకు తలకు కట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఇది ఆయుర్వేద వైద్యులు సూచించిన సలహాలు మాత్రమే. వైద్యుల సలహాలు తీసుకుని ఆహారంలో ఎవరు తీసుకోవచ్చో తెలుసుకోవచ్చు.