IPL 2025 : చెన్నై ఇక కోలుకోలేదా? సూపర్ కింగ్స్ కు ఏందీ పరిస్థితి?
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలయింది;

ఐపీఎల్ సీజన్ మొదలవుతుందంటే అందరూ చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని కోరుకుంటారు. మరోసారి ఛాంపియన్ గా నిలవాలని ఆశిస్తారు. ఎందుకంటే అందులో ధోనీ ఉండటమే ప్రధాన కారణం. అయితే ఈ సీజన్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కు మాత్రం అచ్చి రావడం లేదు. ఎంత పోరాడినా చిన్న జట్లుగా భావించిన వాటి మీద కూడా ఓటమి పాలయి చెన్నై తన అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. హోప్స్ పై నీళ్లు చల్లుతుంది. చెన్నై గెలవాలని, చివరి నిమిషంలోనైనా బంతితో మ్యాజిక్ జరుగుతుందని భావించిన ఫ్యాన్స్ కు మాత్రం గత కొన్ని రోజులుగా నిరాశ ఎదురవుతుంది. అసలు చెన్నై జట్టు ఇంతలా ఫామ్ కోల్పోయి గతి తప్పడానికి కారణమేంటని అభిమానులు మదనపడుతున్నారు.
పంజాబ్ కింగ్స్ మాత్రం....
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడితే అందులో ఒకటి మాత్రమే గెలిచింది. నాలుగు మ్యాచ్ లో ఓటమి పాలయి పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. చివరి స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉంది. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ లో ప్రియాంశ్ ఆర్య 103 పరుగులు చేశారు. శశాంక్ నాటౌట్ గా నిలిచి 52 పరుగులు, యాన్సెస్ 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తం ఇరవై ఓవర్లకు పంజాబ్ కింగ్స్ ఆరు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది పెద్ద టార్గెట్ కాదు.
టార్గెట్ ఛేదించలేక...
చెన్నై సూపర్ కింగ్స్ లో రచిన్ రవీంద్ర 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాన్వే 69 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ అయ్యారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఒక పరుగులు చేసి అవుటయ్యారు. శివమ్ దూబెలో 42 పరుగులు చేశాడు. ధోని 27 పరుగులు, జడేజా 9 పరుగులు చేసినా మొత్తం ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలయింది. దీంతో అభిమానులు నిరాశ చెందారు. కనీసం ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కోలుకుంటుందా? అన్న నమ్మకం రోజురోజుకూ కోల్పోతుంది. ఖచ్చితంగా గెలుస్తామన్న మ్యాచ్ ను కూడా ఓటమి పాలు కావడంతో చెన్నై అభిమానులు డీలా పడ్డారు.