గెలుపు ఏకపక్షమనుకుంటున్నారా?

జగన్ అతి విశ్వాసంతో కన్పిస్తున్నారు. అన్ని పక్షాలు ఏకమైనా తన గెలుపు ఏకపక్షమని జగన్ గట్టిగా నమ్ముతున్నట్లున్నారు;

Update: 2022-01-29 04:40 GMT

జగన్ అతి విశ్వాసంతో కన్పిస్తున్నారు. అన్ని పక్షాలు ఏకమైనా తన గెలుపు ఏకపక్షమని జగన్ గట్టిగా నమ్ముతున్నట్లున్నారు. అందుకే ఆయన పింఛను రూ250 లు పెంచి తనకు తాను దానవీర శూరకర్ణగా అభివర్ణించుకుంటున్నారు. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయడం మామూలే. ఇది కొత్త కాదు. ఎన్టీఆర్ నుంచి ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు వేగం పెరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అది పీక్ కు చేరింది.

సంక్షేమ పథకాలనే....
చంద్రబాబు కూడా సంక్షేమ పథకాలను అమలు చేశారు. చేయలేదని కాదు. కానీ జగన్ మాత్రం చంద్రబాబును మించిపోయారు. కరోనా కాలంలోనూ సంక్షేమ పథకాలను వదలలేదు. దానిని ఎవరూ తప్పుపట్టరు. 80 శాతంమందికి ఆదాయాన్ని పంచి పెడుతున్నారు. దానినీ ఎవరు కాదనరు. కానీ అదే సమయంలో అభివృద్ధి ఏది? అన్న ప్రశ్నకు జగన్ పార్టీ నుంచి సమాధానం దొరకదు. రాష్ట్రంలో రోడ్ల దుస్థిితి అద్వాన్నంగా ఉంది. రోడ్ల అభివృద్ధికి టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు ముందుకు వచ్చే దిక్కులేదు. అంటే కాంట్రాక్టర్లు తమకు బిల్లులు వస్తాయో? లేదో? అన్న సందేహంతోనే పనులకు దూరంగా ఉన్నారు.
చెప్పుకోవడానికి ఏముంది?
ఇక పరిశ్రమల విషయానికొస్తే జగన్ చెప్పుకోవడానికి ఏముంది? చంద్రబాబు తన పాలనలో కియా వచ్చిందని ధైర్యంగా చెప్పుకోగలరు. కానీ జగన్ చెప్పుకోవడానికి ఒక్క పరిశ్రమ పేరును చెప్పగలరా? అన్నది సందేహమే. అసలు ఈ మూడేళ్లలో జగన్ పరిశ్రమలపై అసలు దృష్టి పెట్టలేదనే చెప్పాలి. ఉపాధి అవకాశాలంటే వాలంటరీ వ్యవస్థను, గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని చెప్పుుకోవచ్చు. కానీ ఏపీలో యువత అంటే నిరుద్యోగులు జగన్ ను వచ్చే ఎన్నికల్లో నిలువునా ముంచే ప్రమాదం లేకపోలేదు.
వీరు ఓట్లు వేస్తారా?
దీంతో పాటు ప్రభుత్వోద్యోగుల్లో కూడా వ్యతిరేకత కన్పిస్తుంది. పీఆర్సీ, హెచ్ఆర్ఏ వంటి వాటిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు ఆందోళనకు దిగారు. వచ్చె నెల 6 అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నారు. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో జగన్ వారి కోరికలను తీర్చలేని పరిస్థితి. దీంతో వారు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారతారు.మధ్యతరగతి, ఉన్నత వర్గం ప్రజలు పునరాలోచనలో పడినట్లే కనిపిస్తుంది. కేవలం కుల రాజకీయాలనే చేయాలనుకుంటే కొంపలు ముంచే అవకాశాలు లేకపోలేదు. అన్ని సార్లు పీకే ప్లాన్ లు వర్క్ అవుట్ కావన్నది జగన్ గుర్తించాలి. పార్టీలో ఉన్న లుకలుకలను గుర్తించాలి. నేలమీదకు వచ్చి యుద్ధానికి దిగితేనే ఏదైనా ప్రయోజనం ఉంటుంది. లేకుంటే 2014 ఎన్నికల ఫలితాలు రీపీట్ కావన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు.


Tags:    

Similar News