నర్సీపట్నం సభలో...
దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని జగన్ తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తాండవ - ఏలేరు ఎత్తిపోతల పథకానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నానని తెలిపారు. మెడికల్ కళాశాల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయని తెలిపారు. చేసేదే చెబుతామని, చెప్పిందే చేస్తామని ఆయన అన్నారు. ఇదే జగన్ ప్రభుత్వం అని అన్నారు.
పింఛన్లపై దుష్ప్రచారం...
చెడిపోయిన వ్యవస్థతో తాము యుద్ధం చేస్తున్నామని జగన్ అన్నారు. తమకు అనుకూలమైన వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ఎల్లోమీడియా చూస్తుందన్నారు. ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వం పై బురద జల్లడమే పనిగా పెట్టుకుందని అన్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో పోరాడుతున్నామని తెలిపారు. మంచి చేస్తున్నా వారికి చెడు కనిపిస్తుందన్నారు. పింఛన్లను జనవరి నుంచి పెంచాలని నిర్ణయించామని, అయితే పింఛన్లను తొలగిస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆడిట్ లో భాగంగా వెరిఫికేషన్ కోసం నిబంధనల ప్రకారం నోటీసులు ఇస్తారని, కేవలం నోటీసులు ఇస్తేనే పింఛన్లను తొలగిస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారన్నారు.
దత్తపుత్రుడి స్టయిల్...
చంద్రబాబు హయాంలో కేవలం 39 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని, ఇప్పుడు 67 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని జగన్ తెలిపారు. పింఛన్ల సంఖ్య పెరిగేదే కాని తగ్గేది అనేదే ఉండదని జగన్ ప్రకటించారు. దత్తతండ్రిని నెత్తిన పెట్టుకుని దత్తపుత్రుడు ఊరేగుతున్నాడన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడి స్టయిల్ ఒక్కటేనని, ఈ రాష్ట్రం కాకుంటే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకుంటే ఆ ప్రజలు, ఈ భార్య కాకుంటే ఆ భార్య అని జగన్ అన్నారు. వీరి స్టయిల్ చూస్తే ఇదేం ఖర్మ మన రాజకీయానికి అని అనిపించక తప్పదు. ఒకాయన రాజకీయాల్లో వచ్చి 14 ఏళ్లయినా ఒక్క ఎమ్మెల్యే లేడని, రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడించారని పవన్ ను ఉద్దేశించి అన్నారు.
ఏం చేశారని సభలకు వస్తారు?
ఆయనకు నిర్మాత, దర్శకుడు చంద్రబాబు అని అన్నారు. బాబు స్క్రిప్క్ ఇస్తాడని, దాని ప్రకారమే చదువుతాడని జగన్ అన్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు.. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మంచి ఏది జరిగినా తానే చేశాడంటాడన్నారు. పీవీ సింధూకు బ్యాట్ పట్టుకోవడం కూడా తానే నేర్పించామని అంటాడన్నారు. చివరకు ఆయన నియోజకవర్గం కుప్పంలో తాగేందుకు నీళ్లు లేవన్నారు. ఒక్క స్కీమ్ చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. ఆయనను చూస్తే గుర్తుకొచ్చేది రెండే స్కీమ్ లని.. ఒకటి మోసాలు.. రెండు వెన్నుపోటు అని ఆయన అన్నారు.