"వై నాట్ 175" అంటే కుదరదు మరి
చంద్రబాబును తక్కువ అంచనా వేయలేం. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపోయిందను కోవడానికి వీలులేదు.
చంద్రబాబును తక్కువ అంచనా వేయలేం. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపోయిందను కోవడానికి వీలులేదు. చంద్రబాబు ఇక ఏమీ చేయలేరని భావించడం తప్పే. కేవలం 23 స్థానాలకు మాత్రమే గత ఎన్నికల్లో పరిమితమయినందున ఈసారి కూడా అదే స్థాయిలోనూ, అంతకు తక్కువగానో సాధిస్తుందనుకోవడానికి వీలులేదు. తెలుగుదేశానికి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. చంద్రబాబును పక్కన పెట్టినా ఆ పార్టీకి కరడుకట్టిన కార్యకర్తలున్నారు. ఎన్టీఆర్ అంటే అభిమానమున్న జనం ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్నారు. అందుకనే వై నాట్ 175 అంటూ వైసీపీ వేస్తున్న గంతులు వాల్ పోస్టర్లకే పరిమితమయ్యే అవకాశాలు లేకపోలేదు.
అభివృద్ధికి అడ్రస్ గా...
రాజకీయాల్లో ఎవరినీ తక్కువగా అంచనా వేయలేం. అందులో చంద్రబాబు లాంటి నాయకుడిని అస్సలు తక్కువ దృష్టితో చూడటానికి లేదు. ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతారా? లేక పొత్తులతో ముందుకు వస్తారా? అన్నది ప్రజలకు అనవసరం. చంద్రబాబు పార్టీకి గత ఎన్నికల్లోనే 40 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎవరు అవునన్నా, కాదన్నా చంద్రబాబును ఒక విజన్ ఉన్న నేతగా చూస్తారు. అభివృద్ధి ఆయన వల్లనే జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ నమ్మకమే చంద్రబాబును ఇన్ని సార్లు ముఖ్యమంత్రిని చేసింది. ఆయనకు గ్లామర్ లేకపోవచ్చు. పెద్ద వక్త కాకపోవచ్చు. కానీ ఆయనంటే అభిమానమున్న జనం ఇంకా నియోజకవర్గాల్లో ఉన్నారు. యువతలోనూ ఆయన క్రేజ్ సంపాదించుకుంటున్నారంటే ఈ వయసులో ఆయన సత్తాకు అదే నిదర్శనం.
ఆ ఫలితాలను చూసి...
ఇక ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులను ఎవరూ అంచనా వేయలేరు. అర్బన్ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బలహీనంగా మారింది. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను చూసి మురిసిపోతే ఏం చేయలేం. సాధారణ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అలాగే ఉప ఎన్నికల్లోనూ గెలిచామన్న ధీమాతో ఉంటే ఎవరూ ఆ పార్టీని రక్షించలేరు. ఉప ఎన్నికల్లో సహజంగా జనం అధికార పార్టీవైపు మొగ్గుచూపుతారు. ఎక్కడో తప్పించి అలా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వెలువడదు. అలాగే ఇక ప్రభుత్వ ఉద్యోగులు, మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలు వైసీపీ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా లేరన్నది మాట కాదనలేని వాస్తవం. అంతేకాదు ఆయనకు అన్ని రకాల మద్దతు ఉంది. మీడియా పరంగా ముందున్నారు. జనంలో చివరి ఛాన్స్ అంటూ తాను కోరితే జనం కాదంటారని కూడా చెప్పలేం.
సవాళ్లు అంత వరకే...
ఈ పరిస్థితుల్లో చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామని మంత్రులు సవాల్ విసరడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సవాల్ చేసే మంత్రుల నియోజకవర్గాల్లో వారి పరిస్థితి ఆశాజనకంగా లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబును కుప్పంలో ఓడించాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎవరూ తప్పుపట్టరు. కానీ కుప్పంపై పెట్టిన ఫోకస్ మిగిలిన 174 నియోజకవర్గాల్లోనూ జగన్ పెట్టాలి. అప్పుడు కదా? మళ్లీ అధికారంలోకి వచ్చేది. కేవలం తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మేలు చేస్తాయని చెప్పేందుకు వీలులేదు. అవే తనను ఓటర్లకు దగ్గర చేస్తాయనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. చంద్రబాబు వ్యూహాలు కూడా ఇప్పుడు అర్థం కావు. ఎన్నికలు సమీపించే కొద్దీ అసెంబ్లీ నుంచి వెళ్లగొట్టేలా చేసిన తాను తిరిగి ఎలా అడుగు పెట్టాలో తెలియని అమాయకుడైతే ఆయన కాదు. అది వైసీపీ గుర్తుంచుకుంటే బెటర్.