లాస్ట్ పంచ్ మాత్రం చంద్రబాబుదే

పవన్ ను కలిసేందుకు చంద్రబాబుకు ఎటువంటి అహం అడ్డురాలేదు. మెట్టు దిగిరావడానికి ఆయన సంకోచించలేదు

Update: 2022-10-18 13:53 GMT

రాజకీయాల్లో కొన్నిసార్లు వెనక్కు తగ్గొచ్చు. వెనకడుగు వేయవచ్చు. అది ఓటమిగా భావించడం సరికాదు. అల్పుడని, భయపడిపోతున్నాడని ఎవరైనా అనుకోవచ్చు. అంతిమంగా లక్ష్యం అధికారమే. అందులో చంద్రబాబు లాంటి నేతలకు ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలుసు. సినిమాలో అదే డైలాగు చెప్పిన పవన్ కల్యాణ్ కు అది తెలియకపోవచ్చు. కానీ చంద్రబాబుకు మాత్రం తెలుసు. రాజకీయ ఎత్తుగడల్లో చంద్రబాబుకు మించిన వారు లేరు. ఆయనను మించిన వ్యూహకర్త లేరు.

అనుభవం నేర్పిన...
ఆయన పార్టీ ఓటమి చెందవచ్చు. 23 స్థానాలకే పరిమితం కావచ్చు. వచ్చే ఎన్నికలలో గెలవలేమన్న ప్రచారాన్ని ముమ్మరంగా ప్రత్యర్థులు చేయొచ్చు. ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడూ చంద్రబాబు గెలవలేరని ఎగతాళి చేయొచ్చు. కానీ చంద్రబాబు అవేమీ పట్టించుకోరు. తనకు అంతిమ లక్ష్యం అధికారమే. మళ్లీ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి. అందుకు ఆయన ఎంతవరకైనా వెనకడగు వేస్తారు. చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో పాఠాలు నేర్పాయి. వాటి వల్ల కావచ్చు.. లేదంటే స్వయంగా అబ్బిన విద్య కావచ్చు. బాబును మించిన స్ట్రాటజీ మరొకరికి లేదన్నది కూడా ప్రత్యర్థులు కూడా అంగీకరించే అంశం.
మెట్టు దిగిరావడానికి...
ఈరోజు జరిగింది కూడా అంతే. పవన్ ను కలిసేందుకు చంద్రబాబుకు ఎటువంటి అహం అడ్డురాలేదు. మెట్టు దిగిరావడానికి ఆయన సంకోచించలేదు. స్వయంగా కలిసేందుకు ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లారు. ఐదేళ్ల తర్వాత కలిశారు. అందుకు తగిన సమయం కలిసొచ్చింది. విశాఖలో జరిగిందేందో ఎవరికీ తెలియదు కాని దానిని చంద్రబాబు చక్కగా వినియోగించుకున్నారు. విశాఖలో జరిగిన సంఘటనను చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకున్నారు. బీజేపీని కూడా తన దారికి తెచ్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చంద్రబాబు భావించి ఉండవచ్చు.
ఎత్తుగడలు వేయడంలో...
చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలు వేయడంలో దిట్ట. పవన్ కల్యాణ్ తనకు అనుకూలమనే భావన ప్రజల్లోకి చంద్రబాబు పంపగలిగారు. తనతో పొత్తు పెట్టుకోవాల్సిందేనన్న సంఘటన జరిగేంత వరకూ చంద్రబాబు వెయిట్ చేశారు. సరే.. రేేపటి ఎన్నికల్లో ఎవరు కలిసినా? ఎవరు విడిగా పోటీ చేసినా? ఫలితం మనం ఇప్పుడే చెప్పలేము కాని, ప్రస్తుతం మాత్రం చంద్రబాబు పై చేయి సాధించినట్లే. చంద్రబాబు గేమ్ మొదలు పెట్టారనుకోవచ్చు. బీజేపీ కలసి రాకపోయినా జనసేన, కమ్యునిస్టులతో కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. రేపు పొత్తుల విషయంలో ఎలాంటి తేడాలొచ్చినా అలయన్స్ తప్పనిసరి అని జనసేనను ట్రాప్ లోకి చంద్రబాబు లాగారనే చెప్పవచ్చు. బలవంతంగానైనా ఇక పవన్ కు చంద్రబాబుతో చేతులు కలపక తప్పదు.


Tags:    

Similar News