అన్న అలా... తమ్ముడు ఇలా...ఇక ఎలా?
జగన్ తో టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి చిరంజీవి చొరవ తీసుకోవడం ఇప్పుడు రాజకీయంగా పవన్ కు ఇబ్బందికరంగా మారింది.
మెగా ఫ్యాన్స్ అంటే ఆయన కుటుంబంలోని అందరు నటులు కాంట్రిబ్యూట్ చేసుకుంటారు. చిరంజీవి సినిమా ఇండ్రస్ట్రీలో తెచ్చుకున్న క్రేజ్ ఆయనకు ఆ పేరును, అభిమానులను సంపాదించి పెట్టింది. ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ కు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన జనసేన పార్టీ పెట్టడంతో ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ పరిస్థితులలో జగన్ తో టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి చిరంజీవి చొరవ తీసుకోవడం ఇప్పుడు రాజకీయంగా పవన్ కు ఇబ్బందికరంగా మారింది.
మూడు సార్లు కలసి....
జగన్ ను ఇప్పటికి మూడుసార్లు చిరంజీవి కలిశారు. మూడు సార్లు జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఒకవైపు టాలీవుడ్ సమస్యలపైనే కాకుండా అనేక ప్రజాసమస్యలపై పవన్ కల్యాణ్ జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు పవన్ అన్ని ప్రయత్నాలు చేస్తారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు కు దిగి జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూడాలన్నది పవన్ ఆలోచన.
జగన్ పట్ల....
ఈ నేపథ్యంలో అన్న చిరంజీవి జగన్ పట్ల సానుకూలతతో వ్యవహరించడం పవన్ కల్యాణ్ కు మింగుడు పడకుండా ఉంది. ఒక వైపు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా కాపు సామాజికవర్గంలోనూ ఇది పవన్ కు అననుకూలమైన వాతావరణమే. అలాగని చిరంజీవిని నివారించలేరు. చిరంజీవికి ఇప్పుడు రాజకీయాలు అనవసరం. ఆయన ప్రజారాజ్యం పెట్టి చేతులు కాల్చుకున్నానని భావించి తిరిగి సినిమాల్లోకి వచ్చారు.
రాజకీయంగా ....
ఇటువంటి తరుణంలో జగన్ ను చిరంజీవి పదే పదే ప్రశంసించడం పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఇబ్బందికరమేనని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లోనూ మెగా ఫ్యామిలీ జగన్ కు వ్యతిరేకంగా, పవన్ కు మద్దతుగా నిలుస్తుందనుకోవడం భ్రమే అవుతుంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు డైలమాలో పడ్డారు. చిరంజీవి నిస్వార్థంగానే చిత్ర పరిశ్రమ సమస్యల కోసం కృషి చేసి ఉండవచ్చు. కానీ రాజకీయంగా తమ్ముడికి నష్టం చేకూర్చినట్లేనన్నది మెగా అభిమానుల అభిప్రాయం.