Heavy Rains : తుపాను తరుముకొస్తుంది.. నెల్లూరు, తిరుపతికి రెడ్ అలెర్ట్
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం రాత్రికి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం రాత్రికి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 30న ఫెంగల్ తుఫాన్ తీరం దాటనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తమిళనాడులో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పన్నెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
తమిళనాడుకు...
ఫెంగల్ తుపాను కారైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తీరాన్ని దాటే సమయంలో చెన్నై నగరంతో పాటు నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే తిరువారూర్, నాగపట్నంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన అధికారులు మరికొన్ని జిల్లాల్లో వర్షం తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశముంది. తిరుపతి, నెల్లూరు జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అధికారులకు నో లీవ్...
అందుకే ఈరెండు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా కార్యాలయంలోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు హెల్ప్ లైన్లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చి ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని అధికారులను కోరారు. తీరప్రాంతాల్లోనూ ప్రజలను అప్రమత్తం చేసి వారిని అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వాలు ఆదేశించించింది.