డీఎస్ కు లైన్ క్లియర్ కాలేదా?

ధర్మపురి శ్రీనివాస్ కు రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. ఆయన ఇక కాంగ్రెస్ లో చేరేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండవు.

Update: 2022-04-01 02:36 GMT

ధర్మపురి శ్రీనివాస్ కు రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. ఆయన ఇక కాంగ్రెస్ లో చేరేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. అయితే కాంగ్రెస్ లో డీఎస్ ను చేర్చుకునేందుకు ఒక వర్గం అడ్డుపడుతుందని అంటున్నారు. డి.శ్రీనివాస్ సోనియా గాంధీని కలసి వచ్చి పార్టీలో చేరికకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 24వ తేదీన డీఎస్ పార్టీలో చేరాల్సి ఉంది. సోనియా గాంధీ సయితం ఆయన చేరికకు అంగీకరించారు.

మూడు నెలల నుంచి.....
కానీ ఏమయందో... ఏమో తెలియదు కాని మూడు నెలల నుంచి డీఎస్ చేరిక వాయిదా పడుతూ వస్తుంది. హైకమాండ్ కూడా ఢిల్లీకి పిలిపించుకుని స్థానిక నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. డీఎస్ రాకను అక్కడ మాజీ ఎంపీ ఒకరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఆయన రాకతో పార్టీ బలోపేతం కాకపోగా, పార్టీలో మరో బలమైన గ్రూపునకు బీజం పడే అవకాశముందని హైకమాండ్ చెవిలో వేసినట్లు చెబుతున్నారు.
అభ్యంతరం వారిదే....
నిజామాబాద్ స్థానిక నేతలు కూడా డీఎస్ చేరిక పట్ల అభ్యంతరం తెలుపుతున్నారు. డీఎస్ చిన్న కుమారుడు అరవింద్ బీజేపీలో బలమైన నేతగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో డీఎస్ ను పార్టీలో చేర్చుకుంటే క్యాడర్ అయోమయానికి గురవుతారని కూడా చెబుతున్నారు. అయితే డీఎస్ సామాజికవర్గం పరంగా బలమైన నేత కావడంతో హైకమాండ్ పార్టీలో చేర్చుకుంటే మేలని భావించింది. డీఎస్ ఇప్పటికిప్పుడు పార్టీలోకి వచ్చి చేసేదేమీ ఉండదని, సామాజిక వర్గం అదనపు బలం అవుతుందని కొందరు సూచిస్తున్నారు.
ఏం లాభం...?
కానీ ఇప్పటికే సీనియర్ నేతలతో పార్టీ కి సమస్యగా మారిందని, వారి అనుభవం కన్నా, అసంతృప్తితో పార్టీకి ఎక్కువ డ్యామేజీ జరుగుతుందని కొందరు నేతలు హైకమాండ్ కు నివేదిక పంపినట్లు తెలిసింది. గతంలో మాదిరిగా ఇప్పుడు సీనియర్లలో క్రౌడ్ పుల్లర్లు ఎవరూ లేరని, డీఎస్ ను చేర్చుకోకుంటేనే బెటర్ అని సూచించినట్లు సమాచారం. దీంతో డీఎస్ చేరిక తాత్కాలికంగా వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చేర్చుకుని ఇబ్బంది పడే కన్నా బయట ఉండి మద్దతు తీసుకోవడమే బెటర్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News