ఉప్పు.. ఆరోగ్యానికి నిప్పు!

మనదేశంలో ఉప్పు వాడకం చాలా ఎక్కువగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీనివల్ల దాదాపు 19 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని ఇటీవల వెలువరించిన తొలి నివేదకలో ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న రక్తపోటు బాధితులపై ఆ సంస్థ వెలువరించిన తొలి నివేదిక ఇది.

Update: 2023-10-01 09:59 GMT

దేశంలో పెరుగుతున్న రక్తపోటు బాధితులు

మనదేశంలో ఉప్పు వాడకం చాలా ఎక్కువగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీనివల్ల దాదాపు 19 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని ఇటీవల వెలువరించిన తొలి నివేదకలో ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న రక్తపోటు బాధితులపై ఆ సంస్థ వెలువరించిన తొలి నివేదిక ఇది. విశ్వవ్యాప్తంగా ప్రతీ ముగ్గురిలో ఒకరు రక్తపోటుతో బాధపడుతున్నారని, ప్రతీ ఐదుగురిలో నలుగురికి రక్తపోటు నియంత్రణలో ఉండటం లేదనే చేదు నిజాన్ని ఆ నివేదిక వెల్లడించింది.  

మన దేశంలో మహిళల కంటే పురుషుల్లోనే రక్తపోటు ఎక్కువగా ఉంటోందని ఆరోగ్య సంస్థ తన రిపోర్ట్ లో పేర్కొంది. హృద్రోగాలకు రక్తపోటు ప్రధాన కారణమని, దేశంలో 28 శాతం మరణాలకు గుండె సంబంధ వ్యాధులే కారణమని వైద్యులు సైతం ధృవీకరిస్తున్నారు. స్థూలకాయం, పొగాకు, మద్యపానం వల్ల కూడా బీపీ పెరుగుతుందని పలు నివేదకలు స్పష్టం చేస్తున్నాయి. వీటికి తోడు రోజు మొత్తంలో తీసుకునే ఉప్పు శాతం కూడా అధిక రక్తపోటుకు ప్రధాన కారణమని డబ్లూహెచ్‌ఓ నివేదిక తెలిపింది. ఇక నగరాల్లో హోటల్‌ తిళ్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ కూడా ఉప్పును పెంచి, తద్వారా బీపీని పెంచుతున్నాయి. ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి.

రోజుకు సగటున ఒక మనిషి ఐదు గ్రాములకు మించి ఉప్పును వాడకూడదు. కానీ మన దేశంలో 8.6 గ్రాముల ఉప్పును వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల హృద్రోగమే కాకుండా, కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. దేశంలోని 19 కోట్ల మంది రక్తపోటు బాధితుల్లో కేవలం 15 శాతం మందికి మాత్రమే నియంత్రణలో ఉంటోంది. మిగిలిన వారిలో చాలా మందికి తమకి అధిక రక్తపోటు ఉన్నట్లు తెలియక పోవడం మరింత ఆందోళనకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ఉప్పు వాడకాన్ని నియంత్రించడంలో ఇంకా మనదేశం చాలా వెనుకబడే ఉంది. ఉప్పును తక్కువగా వాడే విషయంలో మనవాళ్లలో అవగాహన పెరగాల్సి ఉంది. లేకపోతే ఉప్పే మన ప్రాణాలకు పెను ముప్పుగా మారుతుంది.

Tags:    

Similar News