ఆప్యాయత సరే.. అసహనం మొదలయినట్లుంది సారూ

ఎమ్మెల్యేలను కాదని సామాజికవర్గం కోణంలోనూ, మరో కారణంతోనో పదవులను పందేరం చేసుకుంటూ వెళితే చివరకు ఎమ్మెల్యేలు మిగలరు.;

Update: 2022-02-08 06:23 GMT

నిజమే.. జగన్ వల్లనే పార్టీ గెలిచింది. ఆయన శ్రమ వల్లనే అఖండ విజయం దక్కింది. పాదయాత్ర తో పాటు ఆయన ఇచ్చిన హామీలు, మాట మీద నిలబడతారనే నమ్మకం జగన్ ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది. దీనిని పార్టీలోనే కాదు విపక్షాలు కూడా అంగీకరిస్తాయి. 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారంటే అది జగన్ పుణ్యమే. దానిని కూడా ఎవరూ తోసిపుచ్చలేరు. అలాగని ఎమ్మెల్యేలను చిన్న చూపు చూస్తారా? వచ్చే ఎన్నికల్లో వారు మరోసారి గెలవాలా? వద్దా? ఇదే ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశమైంది.

అన్నా అని పిలిచి....
ప్రాంతీయ పార్టీ అంటేనే అధినేతలదే ఆధిపత్యం. నిధుల సమీకరణ నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ కష్టమంతా వారిదే. అలాగని ఎమ్మెల్యేలు దేనికీ పనికిరాని వారు కాదు. తమ నియోజకవర్గంలో బలమైన వర్గం ఉన్నవారు. కొందరు ఎమ్మెల్యేలకు సొంత బలంతో గెలిచే సత్తా ఉంది. పార్టీ అధినేత ఇమేజ్ కూడా తోడయితే బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తారు. కానీ జగన్ మాత్రం ఎమ్మెల్యేలను పూచిక పుల్లతో సమానంగా చూస్తున్నారు. అన్నా అని పిలిచినంత మాత్రాన ఆప్యాయత దొరుకుతుందేమో కాని, వారిని రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తే అసహనం ఎమ్మెల్యేలలో మొదలవుతుంది.
వారి ప్రమేయం లేకుండానే...?
వారి ప్రమేయం లేకుండానే పదవుల పందేరం చేస్తున్నారు. వారితో సంబంధం లేకుండా పదవులు వచ్చి పడుతుండటంతో ద్వితీయ శ్రేణి నేతలు సయితం వచ్చే ఎన్నికల్లో తామే ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది భవిష్యత్ లో పార్టీకి తీవ్ర నష‌్టం చేకూరుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రొద్దుటూరు ఎమ్మెల్సీ పదవి రమేష్ యాదవ్ కు ఇవ్వడంతో అక్కడ పార్టీలో రగడ ప్రారంభమయింది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య సయోధ్య లేదు. ఫలితంగా క్యాడర్ అయోమయంలో పడింది.
పదవుల పంపకంలో....
నగరి నియోజకవర్గంలో ఒక మండల స్థాయి నేతకు శ్రీశైలం బోర్డు ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇది కూడా అక్కడ అగ్గిని రాజేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు తెలియకుండానే జగన్ పదవులను కట్టబెడుతున్నారు. పార్టీ కోసం కష్టించి పనిచేసిన వారికి పదవులు ఇవ్వడంలో తప్పులేదు. అలాగని ఎమ్మెల్యేలను కాదని సామాజికవర్గం కోణంలోనూ, మరో కారణంతోనో పదవులను పందేరం చేసుకుంటూ వెళితే చివరకు ఎమ్మెల్యేలు మిగలరు. జగన్ ఇమేజ్ తోనే వచ్చే ఎన్నికల్లో గెలవడమూ సాధ్యం కాదు. విలువ లేని చోట ఎమ్మెల్యేలు ఉండటమూ సాధ్యపడదు. అది పార్టీకి రానున్న రోజుల్లో భారీ నష్టం చేకూరుస్తుంది. జగన్ ఇది గుర్తెరిగి మసలుకుంటే మంచిది.


Tags:    

Similar News