Summer Effect : ఇంట్లో ఉన్నా వడదెబ్బ తప్పదా? ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి?
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. సాధారణంకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి;

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. సాధారణంకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఉక్కపోత వాతావరణం కూడా రోజురోజుకూ పెరుగుతుంది. మార్చి నెల ఆరంభంలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే ఇక మే నెలలో మరింత పెరుగుతాయని ఇప్పటి నుంచే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ముందుగానే హెచ్చరించిన వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
సాయంత్రం ఆరు గంటల వరకూ...
ఉదయం పద కొండుగంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఎండల తీవ్రత తగ్గడం లేదు. ఈ మధ్య సమయంలో కాలు బయటకు పెడితే ఇక అంతేనని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. వడగాలుల తీవ్రత కూడా అధికం కావడంతో వడదెబ్బ తగిలే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రజలు వీలయినంత వరకూ బయటకురాకుండా ఉండటమేమేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనాఅత్యవసర పనులుంటే సాయంత్రంవేళ వచ్చిచూసుకుని తిరిగి ఇంటికి చేరుకోవాలని అంటున్నారు.
అధిక ఉష్ణోగ్రతలు...
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు, ఒంగోలు,అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఈ సారి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. అలాగే తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందుకే వ్యవసాయపనులకు వెళ్లేవారు, పశువుల కాపర్లు తగిన జాగ్రత్తలు పాటించాలని విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది.