మూడు జిల్లాల్లో వైసీపీని ముంచింది అదేనా?

మూడు రాజధానుల అంశం మూడు జిల్లాల్లో వైసీపీని దెబ్బతీసినట్లే కన్పిస్తుంది

Update: 2021-11-18 02:17 GMT

మూడు రాజధానుల అంశం మూడు జిల్లాల్లో వైసీపీని దెబ్బతీసినట్లే కన్పిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పుంజుకున్నట్లే కన్పిస్తుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ బలోపేతమయిందనే చెప్పాలి. రాజధాని అమరావతి అంశం పనిచేసినట్లే అనుకోవాలి. చంద్రబాబు కూడా నమ్ముతున్నది అదే. అందుకే అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నానని పదే పదే చెబుతున్నారు.

కృష్ణాలో...
మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ ఒక రకంగా గెలిచినట్లే చెప్పుకోవాలి. జగ్గయ్యపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఉన్నా అక్కడ టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడ పదిహేడు వార్డుల్లో వైసీపీ గెలవగా, 14 వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ 14 స్థానాలను గెలుచుకున్నాయి. కృష్ణా జిల్లాలో టీడీపీ పుంజుకుందని చెప్పడానికి ఈ అంకెలు చాలు. జగ్గయ్య పేట చివరికి వైసీపీ పరమయినా ఆనందపడాల్సిన పనిలేదు.
గెలవలేకపోయినా.. ఓటింగ్ శాతం...
ఇక గుంటూరు జిల్లాలో కూడా అదే రిజల్ట్ రిపీట్ అయింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అధికారంలో ఉన్నా ఒక డివిజన్ ను వైసీపీ కోల్పోయింది. కార్పొరేషన్ లోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి ఓడిపోవడం రాజధాని ఎఫెక్ట్ అన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. దాచేపల్లి, గురజాల మున్సిపాలిటీలోనూ టీడీపీ పుంజుకుంది. ఇక ప్రకాశం జిల్లాలో దర్శి మున్సిపాలిటీని ఏకంగా టీడీపీ దక్కించుకోవడం విశేషం.
రాజధాని అంశం....
టీడీపీ ఈ మూడు జిల్లాల్లో అనూహ్య రీతిలో పుంజుకోవడానికి రాజధాని అంశమే కారణమని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ మూడు జిల్లాల్లో భూముల ధరలు పడిపోయాయి. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు రావడంతో ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా కరువయ్యాయి. దీంతో ప్రజల్లో వైసీపీ పట్ల అసంతృప్తి ఉందన్నది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమయింది. రానున్న రోజుల్లో ఈ మూడు జిల్లాల్లో టీడీపీ మరింత పుంజుకునే అవకాశముందని ఆ పార్టీ నేతలు భరోసాగా ఉన్నారు.


Tags:    

Similar News