ఆ గడప తొక్కడం ఇష్టం లేదా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఆయనకు ఆహ్వానాలు అందుతున్నా సున్నితంగా తిరస్కరిస్తున్నారు

Update: 2022-08-19 07:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో అధినాయకత్వాన్ని కలిసేందుకు పరితపించి పోతుంటే ఆ పార్టీతో పొత్తుతో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం దూరంగా ఉంటున్నారు. నిజానికి అన్ని కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ ను కేంద్రం పెద్దలు ఆహ్వానిస్తూనే ఉన్నారు. కానీ ఆయన మాత్రం హస్తిన గడప తొక్కేందుకు ఇష్టపడటం లేదు. తనకు రాష్ట్ర నేతలతో సంబంధం లేదని, ఢిల్లీ నేతలతోనే సత్సంబంధాలున్నాయని చెప్పే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. తనకు లభించిన అవకాశాన్ని కూడా ఆయన వినియోగించుకోవడం లేదు.

కేంద్రం పెద్దలకు....
అసలు జనసేనాని ఢిల్లీ అంటేనే ఇష్టపడటం లేదు. ఇటీవల జేపీ నడ్డా విజయవాడకు వచ్చినప్పుడు కూడా దూరంగా ఉన్నారు. అలాగే ప్రధాని మోదీ తాను పోటీ చేసిన భీమవరం నియోజవర్గంలో పర్యటించినప్పుడు కూడా పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. తన సోదరుడు చిరంజీవి వెళ్లి ప్రధానిని కలిసినా, పవన్ మాత్రం దూరంగా ఉన్నారు. ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగాయి. మోదీ నుంచి అమిత్ షా వరకూ అగ్రనేతలందరూ హైదరాబాద్ లోనే ఉన్నా పవన్ కల్యాణ్ మాత్రం వారిని కలిసే ప్రయత్నం చేయలేదు. అసలు బీజేపీతో ఆయన పొత్తులో ఉన్నారా? లేదా? అన్న అనుమానం కూడా కలుగుతుంది.
పిలిచినా పోకపోయినే...
ఇక ఆజాదీ అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కు కూడా పిలుపొచ్చింది. అయితే వైరల్ ఫీవర్ తో ఉన్న తాను సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని మాత్రం ఆయన చెప్పారు. ఇలా బీజేపీ ఢిల్లీ నాయకత్వాన్ని కలిసేందుకు పవన్ కల్యాణ్ ఇష్టపడటం లేదు. ఇందుకు కారణాలేమై ఉంటాయన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ఇక రాష్ట్ర పార్టీతో కలసి ఏ కార్యక్రమంలోనూ ఆయన కలసి పని చేయడం లేదు. ఇటీవల జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ‌్ ఆత్మకూరు ఉప ఎన్నికలకు దూరంగా ఉండటం సహజంగా సామాన్య కార్యకర్తకు డౌట్ వస్తుంది.
బాబు దగ్గరవుదామనుకుంటే....
ఇక రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ పాదయాత్ర చేస్తున్నా జనసేన మాత్రం పట్టించుకోవడం లేదు. రాజధాని అమరావతిలోనే ఉండాలని పవన్ కల్యాణ్ బీజేపీతో కలసి పాదయాత్ర చేయాలని గతంలో నిర్ణయించారు. అయితే అప్పట్లో అది వాయిదా పడింది. కానీ బీజేపీయే పాదయాత్ర చేసినా సంఘీభావంగా ఒక్కరోజు కూడా పాల్గొనకపోవడం విశేషం. పవన్ కల్యాణ్ ఇట రాష్ట్ర పార్టీ నేతలకు, అటు ఢిల్లీకి దూరంగా ఉండటం దేనికన్న ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటే, దగ్గరగా ఉన్న పవన్ ఎందుకు దూరమవుతున్నట్లు అనే సందేహాలు రాజకీయంగా కలుగుతున్నాయి. మరి కాలమే దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.




Tags:    

Similar News