పాలమూరు జిల్లాకు శత్రువులు జిల్లాలోనే ఉన్నారని, వారిని ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే జిల్లాకు పట్టిన దరిద్రం పోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ... కేసీఆర్ ను కొట్టే దమ్ములేక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా నుంచి చంద్రబాబును భుజాలపై మోసుకుని వస్తుందని ఆరోపించారు. ఒకవేళ పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఆపేస్తారని పేర్కొన్నారు. కొడంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని, తానే స్వయంగా కొడంగల్ కి ప్రత్యేకంగా సమయం కేటాయించి సమస్యలన్నీ పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ప్రజలు ఆగమాగం అయ్యి గాలి గాళ్లను గెలిపిస్తే వాళ్లు గాలి గాలి తిరుగుతరని ఎద్దేవా చేశారు. తన వద్ద ఉన్న సర్వే రిపోర్టు ప్రకారం మహబూబ్ నగర్ జిల్లాలో 14కి 14 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతోందని స్పష్టం చేశారు. ప్రజలు వాస్తవాలు గ్రహించారని, వారిలో మార్పు వచ్చిందని, టీఆర్ఎస్ ను గెలిపించబోతున్నారని పేర్కొన్నారు. కాగా, రేవంత్ రెడ్డి పేరును సైతం కేసీఆర్ ప్రస్తావించకపోవడం గమనార్హం.