జగన్ కు త్రీ కాంబో.. థ్రెట్ కానుందా?

ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తుంటే ఈసారి జగన్ ఒంటరిగా ముగ్గురు రాజకీయ శత్రువులను ఎదుర్కొనాల్సి ఉంటుంది.;

Update: 2021-12-13 04:07 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు మూడేళ్ల ముందే హీటెక్కాయని చెప్పాలి. ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తుంటే ఈసారి జగన్ ఒంటరిగా ముగ్గురు రాజకీయ శత్రువులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. 2014 సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అదే ఫలితాలు రిపీట్ అవుతాయా? అన్నది పక్కన పెడితే ఈసారి జగన్ కు 2019 ఎన్నికల్లో సాఫీగా సాగిన ప్రయాణం ఈసారి ఉండదనే చెప్పాలి.

మూడు పార్టీలు కలసి....
2014లో బీజేపీ, జనసేన, టీడీపీ లు కలసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోమని కొందరు నేతలు చెబుతున్నా పవన్ కల్యాణ్ చివరి నిమిషంలో బీజేపీ పెద్దలను ఒప్పిస్తారన్న నమ్మకం అయితే ఉంది. జనసేన లేకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు లేవు. అలా పోటీ చేసి 2019 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లను తెచ్చుకుంది. మరోసారి చేయి కాల్చుకునే అవకాశమయితే లేదు.
ఒంటరిగానే....
ఇక జనసేన కూడా బీజేపీతో కలసి వెళితే జోగి జోగి రాసుకుంటే అన్న సామెత గుర్తుకు రాక మానదు. అందుకే మూడు పార్టీలు కలసి పోటీ చేసి జగన్ ను దెబ్బతీయాలన్న ఆలోచనలో పవన్ ఉన్నారు. ఖచ్చితంగా అదే జరుగుతుందని జనసేన అగ్రనేతలు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. దీంతో జగన్ మరోసారి ఒంటరిగా మూడు పార్టీలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే జగన్ 2014లో మాదరికాదు. ఇప్పుడు చాలా రాటుదేలి ఉన్నారు.
కులాలే శాసించనున్న...
సంక్షేమ పథకాలే తనను గట్టెక్కిస్తాయని నమ్మకంతో ఉన్నారు. పవన్, చంద్రబాబు, బీజేపీ కలిస్తే కాపు ఓటు బ్యాంకు కొంత దెబ్బతింటుందన్నది జగన్ కు తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీ ఓటు బ్యాంకుపై జగన్ గురి పెట్టారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేదు. పవన్ ను విశ్వసించడం కష్టం. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ పై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు. కానీ మార్పు కోరుకోవడానికి కూడా అవకాశాలున్నాయి. కులాలే గెలుపును తెచ్చి పెట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి జగన్ కు కొంత ప్రతి కూలత తప్పదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.


Tags:    

Similar News